ఏదో ఒకరోజు ..
అడవిలో పోరు ముగిసిపోవచ్చు
బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల గర్భశోకం
ఎడతెగని ఊటగెడ్డలా పారుతూంటుంది
నుదుట పొద్దులు రాలిపోయాక -
బతుకు పొడుగునా రుతువులు
కన్నీటిపూలు పూస్తుంటాయి
ఓ నాలుగు పసికళ్లు ..
యింటికి రాని తండ్రి కోసం మునివాకిట
యింకా ఎదురుజూస్తూనే ఉంటాయి !
ఏదో ఒక రోజు ..
అడవిలో పోరు ముగిసిపోవచ్చు
అప్పటికే కొన్ని కలలు రాలిపోతాయి
యింకొన్ని ఆశలు భళ్లున పగిలిపోతాయి
వేనవేల నెత్తుటిపక్షులు నేల కూలిపోతాయి
జీమూతంగా ముసురుకున్న గాలివానకు
పచ్చనిగూళ్లు చెదిరిపోతాయి
ఎండుటాకులాంటొక పాట రాలిపోయి
ఎర్రని ధూళిలో కలగలసిపోతుంది !
ఏదో ఒక రోజు..
అడవిలో పోరు ముగిసిపోవచ్చు
అప్పటికే అడవి
అమ్మతనాన్ని కోల్పోయీ అంగడై పోతుంది
గూడు కోల్పోయిన పక్షొకటి
వలసరాగమెత్తుకొనీ దిక్కలకేసెగిరిపోతుంది !!
- సిరికి స్వామినాయుడు
సెల్:9494010330










