నేనొక ఆశలపిట్టనై ఎగురుతూ
నింగినంతా చుట్టేస్తున్నాను
తడబడుతున్న జీవితపు అడుగులను
సరిచేసుకుంటూ... కదిలిపోతున్న కాలాన్ని
నిలదీస్తూ... కష్టాల తుపానులో చిక్కుకొని
బతుకు నావను నడిపిస్తున్నాను
హృదయపు గదిలో నిండిన తిమిరాన్ని
నాలుగు వెలుగు చుక్కలను విసిరి పారదోలుతున్నాను
గతమంతా కత్తుల వేటలామారి వేధిస్తున్నా
గడుస్తున్న కాలంతో యుద్ధం చేస్తూనే వున్నాను
ఆశించిన ఫలితం ఎప్పుడూ నన్ను పలకరించకున్నా
ఏనాడూ కంగిపోలేదు
నా మదిలో బాధంతా భూతల్లికి తెలుసు
రాలుతున్న చెమటచుక్కల సాక్షిగా...
పొలం ఒడ్డున పొద్దస్తమానం ఎవుసాన్నే
నమ్ముకొని బతుకు సాగిస్తున్నా ...
కాడెడ్లు రెండు నెర్రలు బారిన నేలను దున్ని
మట్టిలోంచి మాణిక్యాలను తియ్యుమంటున్నవి
విత్తిన విత్తులన్నీ నా మంచికోరి మొలుస్తున్నయి
పురుడోసుకుంటున్న మొక్కలన్నీ నను
మదిలో నింపుకొని మొలకెత్తుతున్నయి
పూస్తున్న పూవ్వులన్నీ నేత్రాల కిటికీలు తెరుచుకొని
నన్నే చూస్తున్నాయి
తూనీగల గుంపంతా.. కైగట్టి పాడుతున్న నా కన్నీటి
పాటను వింటూ నా చుట్టే తిరుగుతున్నయి
మట్టి గంధమంతా నా నుదుటన తాకి
వీరతిలకాన్ని దిద్దుతున్నయి
ఆకాశం నుంచి జారిన అంబువు
పుడమితల్లి తనువుపై ..మొక్కలను ముద్దాడుతున్నయి
పొట్టకచ్చిన వరిపైరు..
పాలపొంగుల్లా పొంగుతున్న తెల్ల బంగారం...
జొన్నకంకులన్నీ తమ మెడలు వంచి సలాం చేస్తున్నవి
కళ్లనుంచి రాలుతున్న కన్నీరును తుడుస్తున్నయి
అవిశ్రాంత యుద్ధంలో గెలుపు పిలుపు ఎక్కడో మరి
ధాన్యపు రాసుల కళ్ళంకాడ.. దళారుల గుంపు
ఏడాది కష్టమంతా తాలు రూపంలో ఎగిరిపోతుంది
తూకంలోని గింజలన్నీ బరువు తగ్గి
సేద్యకాడి గుండెలో గుబులురేపుతున్నయి
నిన్నంతా నిండిన సంతోషం... కళ్ళముందు
కదలాడుతున్న కల్లోలానికి ఊగిసలాడుతుంది
నాలుగు పచ్చనోట్లు నాకాడికి రాగానే
కలవడినట్లు వాలిపోతరు
నూటికి ఐదుపైసల నా మిత్తి దోస్తులు
నేనిప్పుడు మళ్ళీ పరుగెత్తేది
నేను నమ్ముకున్న సేద్యంకాడికే
ఇంకెన్ని చెమటచుక్కలు బాకీవున్నానో
ఇంకెన్ని రక్తపుబొట్లు దారపోయాలో..ఈ నేలతల్లికి!
నేను నేలతల్లికి సేవచేసే సైనికున్ని!
నాది అవిశ్రాంత యుద్ధం..
కొనసాగుతూనే వుంటుంది; ఈ తనువు కాలే వరకూ!
- అశోక్ గోనె, 94413 17361










