Sep 12,2022 07:05

నేను చిందులాడి నేను డప్పులు గొట్టి
యలసి సొలసి సత్తికొలుపు కొలవ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె !

                                     - మహాకవి గుఱ్ఱం జాషువా గబ్బిలం

డా|| పులికొండ సుబ్బాచారి రచించిన మాదిగ కొలుపు నవల మొత్తం నిడివి 207 పేజీలు కాగా, ఐదు అధ్యాయాల్లో కథ సాగింది. ప్రారంభం నుంచి ఎనభయ్యో పేజీ దాకా అంకమ్మ కొలుపు గురించి కాగా, మిగతా వివిధ అంశాలతో కూడిన కధ సాగింది. ఈ నవలకు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆచార్య కాత్యాయని విద్మహే, జూపాక సుభద్ర, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ముందు మాటలు రాశారు. నవల
     పైన జాషువా చెప్పినట్లు కొలుపు కోసం నేను చిందులాడి, డప్పు కొట్టి అలసి, సొలసి అంకమ్మ కొలుపు కొలిస్తే దాని ఫలితం పరులు (సంపన్న వర్గాలు, పెత్తందార్లు) పంచుకొని పోవు నీచమైన భూమి ఇది. ఈ నవల ప్రారంభం నుంచి చివరి వరకు ఈ దృక్పథంతో కథను చెప్పడంలో రచయిత సఫలమయ్యారు. కొలుపును, అంకమ్మ తల్లి వెలసిన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు పాఠకుల ముందు ఉంచారు. అంకమ్మ తన భర్తని, కొడుకుల్ని ఎందుకు బలితీసుకొన్నదో వివరించారు. అది కథగా కొమ్ములవారి ద్వారా రచయిత చెప్పించి మెప్పించారు. ఆ కథ ప్రకారం.. ఓ బ్రహ్మణ పూజారి కుమార్తె ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బ్రహ్మణుడిలా వేషం ధరించిన ఓ మాదిగ కుర్రాడిని పెండ్లి చేసుకుంటుంది. ఆమెకు ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత ఆ యువకుడి తల్లి వారి ఇంటికి వస్తుంది. అప్పుడు వారి కులం బయటపడి, ఆ యువతికి ఆగ్రహం కలుగుతుంది. తనని మోసం చేసిన ఆ యువకున్ని, ఇద్దరి కుమారుల్ని ఆమె బలితీసుకుందిట. కులాధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రచారం చేయటానికి ఈ కథ ఉపయోగపడుతుంది. తరతరాలుగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ మనువాద సమాజం కథగా అల్లి, దళితుల చేతనే ఆ పుక్కిట పురాణాలను చెప్పించి, దళిత జాతిని మోసం చేస్తోంది. పెత్తందార్ల బిడ్డలను ఎవడైనా దళితుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే వాడిని, వాడి వల్ల కలిగిన సంతానాన్ని నిలువునా దహించి వేయాలని ఈ కథ సారాంశం. ఇలాంటి కథలు కొలుపు, జాతర్లు మాదిగ జాతిని ఉద్ధరించలేవు సరికదా.. ఇంకాస్త అంధకారంలోకి, అజ్ఞానంలోకి నెడతాయి. ఈ పోలి, బలి కథ ఎలా ఉన్నప్పటికీ మాదిగ కొలుపు నవలలోని కథానాయికి అన్నపూర్ణ, కధానాయకుడు కోటేశ్వరరావు ద్వారా రచయిత సమాజానికి గొప్ప సందేశం ఇచ్చి నవలకు జీవం పోశారు.
     అగ్రవర్ణానికి చెందిన అన్నపూర్ణ తన బాల్యం నుంచి దళిత సామాజిక వర్గం పట్ల సానుభూతి, సమభావన కలిగి ఉంటుంది. మాల, మాదిగ పల్లెల్లో చదువుకోని పిల్లల్ని బడిలో చేర్పించి వారు చదువుకునేటట్లు ప్రోత్సహిస్తోంది. ఆచార వ్యవహారాలను ఈ కధలో అణువణువూ పూసగుచ్చినట్టు వివరించారు. మాదిగ జాతికి సింబాలిక్‌గా దండోరా ద్వారా కథను ప్రారంభించారు రచయిత. డప్పురిథం 'డిమికి డిమికి' అనే శబ్దంతో మొదలవుతుంది. పెద్ద మాదిగ, దండోరాకు కాకలేని డప్పుని సంకకు తగిలించుకొని వాయించినప్పుడు అలాంటి శబ్దం మామూలే అనుకోవచ్చు. మిగతా విషయాల్లో కూడా అదే శబ్దాన్ని ప్రయోగించారు రచయిత. అసలు డప్పు శబ్దం ఓ చైతన్యానికి గుర్తు కనునే కమ్యూనిస్టు పార్టీలు డప్పుని ఉద్యమాల్లో వాడి ఉర్రూతలూగించాయి. అసలు సిసలైన డప్పు శబ్దం జ్జెజ్జనక, జనకజనక అనే తాళంలో పడాల్సి ఉంది. హిందూమత వ్యవస్థలో అంటరానితనంతో పాటు తాగుడు, వివాహేతర సంబంధాలు ఎలా విస్తరిస్తున్నాయో రచయిత తనదైన శైలిలో చక్కగా వివరించారు. భర్త చనిపోయిన సుగుణను సారా వ్యాపారి పాపయ్య కొడుకు ఓబులు నాయుడు మాయమాటలతో డబ్బు ఆశ చూపించి ఆమెను లొంగతీసుకోవాలని చూడడం, సుగుణ చాకచక్యంగా తన వారిని పిలిచి ఓబులు నాయుడ్ని పందిరి గుంజకు కట్టేసి దున్నమాంసం చియ్యలు తినిపించిన తీరు శత్రువును చాకచక్యంగా గెలవడం ... రచయిత వివరించిన తీరు బాగుంది.అయితే, మాదిగల వివాహతంతుకు సంబంధించి రచయిత చెప్పిన దానికి, వాస్తవానికీ పొంతన లేదు. దళితులు తమకు లేని ఎడ్లబండ్లను రైతుల దగ్గర అడిగి తెచ్చుకొని, ఆ బండిని అలంకరించి ఊరేగుతూ మొదటిగా ఆచార్ల ఇంటికిపోయి వారికి దండం పెట్టి, ఆ తరువాత ఊరిలో రైతుల బజారుకు పోయి ఇంటింటా ఆగి వారు ఇచ్చిన రూపాయో, అర్ధరూపాయకో చేతులు చాపే అంత దౌర్భాగ్యం మాదిగలకు పట్టలేదు. మాదిగల పెళ్లిళ్లు మాదిగ పల్లెలోనే జరుగుతాయి. మాదిగలు బండెక్కి ఊరేగితే రైతులు ఊరుకుంటారా? నేను అనేక సామాజిక ఉద్యమాల నేపథ్యంలో అన్ని జిల్లాలూ తిరిగాను. ఎక్కడా ఈ తీరు లేదు. సారా దుకాణాలు ఊరుదాటి వాడదాకా వచ్చి మాదిగ వాడలోని ఎన్నో సంసారాలను ఛిద్రం చేసిన సంఘటనలను రచయిత చాలా చక్కగా వివరించారు. సమస్యను పాఠకుల ముందు ఉంచడంలో సఫలమయ్యారు.
     ఒకప్పుడు మాదిగ, ఉపకులాలు కొలుపు జాతర్లలో రైతుల దగ్గర వినయంగా ఉండాల్సి వచ్చేది. పంచాయితీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మర్లప్రోలు పంచాయతీ రిజర్వేషన్‌ అవ్వడంతో అవనన్న అనబడే హనుమంతురావు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. తరువాత ఆ వూరి మాదిగలు కొంతలో కొంత ఆత్మగౌరవం చాటుకున్నట్లయింది. ఈ నవలలో కోటేశు పాత్ర చూడగానే 'పంచమం నవలలో శివయ్య గుర్తుకు వస్తాడు'. మర్లప్రోలు గ్రామానికే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నత విద్యావంతుడై డిప్యూటీ కలెక్టర్‌ గ్రూప్‌-1 కేడర్‌కు సెలక్టవ్వడం ఆ జిల్లా మాదిగ జాతి గర్వించదగిన విషయం. రాజ్యాలను గెలవచ్చు రాజులవ్వొచ్చు.. మనస్సులు గెలవడం ఎవరి తరం? తన ప్రవర్తనతో, తెలివితేటలతో కోటేశ్వరరావు అన్నపూర్ణ మనస్సును గెలిచి.. ఒక మాదిగ యువకుడు పెత్తందారుల కుటుంబానికి అల్లుడైన కథను సుఖాంతం చేయడంలో రచయిత విజయం సాధించారు. ఇది మాదిగ సామాజిక కొలుపుగా, కోటేసు కొలుపుగా రచయిత పటేలు నోట చెప్పించిన తీరు చక్కగా ఉంది. ఈ నవలలో మాదిగల సంప్రదాయ ఆచార వ్యవహారాలను చక్కగా చెప్పడంతో పాటు సామాజిక సందేశం ఇచ్చారు రచయిత. ఈ నవల వెల : రూ.250. రచయితను 94404 93604 నెంబర్లో సంప్రదించవొచ్చు.

- దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి
8096225974