Aug 15,2022 07:33

కొన్ని విషయాలను ప్రత్యక్షంగా చెప్పడం కంటే, పరోక్షంగా, వ్యంగ్యంగా చెప్పినప్పుడే అది ఎదుటివారికి అర్థమవుతుంది. సూటిగా తాకుతుంది. దీనిని 'దెప్పి పొడవడం' అంటారు. ఇలాంటి కవితా పద్ధతిని ఏనుగు నరసింహారెడ్డి సమర్థవంతంగా వాడుకున్నారు. జారిపోతున్న మానవీయ జీవన దృశ్యాలను పట్టుకోవడమే కాకుండా, సాహిత్యంలోకి, చరిత్రలోకి ఎక్కకుండా మిగిలిన ఎన్నో వాదాలు, ధోరణులు మానవీయ సంఘర్షణలను పట్టుకుని, తన కవిత్వంలో వాటిని ఆవిష్కరిస్తాడు కవి. పరిపాలన రంగంలో పేరుపొందిన నరసింహారెడ్డి గారు వృత్తిరీత్యా డిప్యూటీ కలెక్టర్‌, ఎంతో ఇష్టంగా కవిత్వం, కవిత్వ విమర్శ రాస్తారు. కొత్త పలక కవిత్వ సంపుటిలో ఆయన జీవితాన్ని అనేక రూపాల్లో ఆవిష్కరించారు.
    ఈ కవి సామాన్యుల్ని, అసామాన్యుల్ని, ప్రజల్ని, పరిపాలన రంగాన్ని, రాజకీయాలను నిశితంగా పరిశీలించారు. తనకు తెలియనిది, అనుభవించనది, అనుభూతి చెందనిది రాయరు. ఆయన రచనల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. నరసింహారెడ్డి మూడు విషయాల గురించి కలత చెంది కవిత్వాన్ని రాశారు. అవి ప్రధానంగా తెలంగాణ ప్రజల వ్యవసాయ జీవితం, తెలంగాణ ప్రజా ఉద్యమం, మధ్య తరగతి ఉద్యోగ జీవితం .లోపలి ప్రపంచంలో ఒక కదలిక తీసుకురాగల కవిత్వమే అసలు సిసలైన కవిత్వంగా చెప్పవచ్చు. ఇది వాస్తవాలకు, సంఘర్షణలకు అతీతమైనదేమీ కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచింపజేస్తూ, ఆర్తిని, ఆర్ద్రతని ప్రోది చేసే లక్షణంతో కూడి ఉంటుంది. అప్పుడే వైయక్తికం, సామాజికం కలగలిసి ఒక కొత్త ఆవిష్కరణ తావు దొరుకుతుంది. అలాంటిదే ఏనుగు నరసింహారెడ్డి గారి కవిత్వంలో చూడవచ్చు. నిశితమైన అవగాహన ఉన్న కవిగా ఆయన వాక్యాలు జీవశక్తిని, రసపుష్టిని కలిగి ఉంటాయి.
      'తల్లులు మాసిన పిల్లల నెత్తులోంచి/ పెండ్లను ఏరి కుక్కినట్లు/ పక్షులు కొమ్మల రెక్కల నడుమ/ గండు చీమల్ని ఏరిపారిస్తుండేవి' అంటూ 'ఒక ఊరు' కవితలో ఒకప్పటి ఊరి వాతావరణం వర్ణించారు. 'అఆలు ఎన్ని వస్తాయన్న టీచరు ప్రశ్నకు/ పలకనిండా అన్న నా జవాబుకి/ ఆమె ఎందుకు పగలబడి నవ్విందో/ నాకసలే అర్థం కాలేదు' అంటూ 'కొత్త పలక'లో జీవితపు పాఠాలు రాశారు. 'వన సమూహపు వయ్యారాలు/ చెరువు చెమ్మల చల్లదనాలు మార్కెట్లో మధురిమలు దాచుకున్న రోడ్డు ఉన్నట్లుండి ఉలిక్కిపడుతుంది' రహదారులన్నీ రక్తసిక్తమై 'యముడు నడిచే దారి' అయ్యిందంటాడు కవి.
     'మేకలకు ఆకులు బహుమానం/ గోదలకు పసిరిక ఫలహారం పోరలకు క్రీడా మైదానం' అంటూ తమ సమస్త బాల్యపు విహారాలను 'రంగుల కలలో' ఆవిష్కరించారు. 'కళలున్నచోట కలహాలున్నట్టే/ జీవితమన్నాక కలలు శాశ్వతం కాదని/ విడిపోయినప్పుడు/ ఇక వేదిక నుంచి దిగిపోయినట్లు' అని కాలేజీ జీవితాన్ని 'కలల ప్రపంచంలో' దృశ్యమానం చేశాడు. 'కొన్ని వృత్తులు బాధ్యతల బరువుతో కృంగిపోతూ/ సమస్త శక్తుల్ని ఒడ్డి చేయాల్సిన పోరాటాలు' మధ్య తరగతి ఉద్యోగ వేదనను 'మాట జారని సమాధానం'లో చిత్రించాడు.
     డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి గారి కవిత్వం మెత్తని నడక, లోతైన గాఢత కలిగి ఉంటుంది. 'ఎండలో కన్నెర్ర చేసిన మోదుగు పూలు', 'వలసకాలం'లో అంటారు. పల్లెతో, పట్నంతో, నగరంతో సంబంధం ఉన్న డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి గారి మూలం నుంచి వచ్చినటువంటి మట్టి సుగంధాల వలె, ఈ పుస్తకంలోని కవితలు చదివితే పాఠకులకు పరివ్యాప్తమవుతాయి. ఈ కొత్త పలక పుస్తకంలో రాసిన 52 కవితలు ప్రతిదీ ఆణిముత్యమే. చదివితే రచయిత అంతరంగాల్లోని అలజడి తెలుస్తుంది. మహేష్‌ మాలేకర్‌ పుస్తకాన్ని చక్కగా డిజైన్‌ చేశారు. అభినందనలు.
 

- యాడవరం చంద్రకాంత్‌
94417 62105