Oct 03,2022 07:54

అంతకుముందు సంగతేమో గానీ 1960వ దశకం తరువాత పుట్టినవారికి అంతోయింతో కంప్యూటర్‌ వాడే పరిజ్ఞానం సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనివేగం పెరగడానికి, పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఉత్పత్తి పెంచడానికి కంప్యూటర్లు వాడకంలోకి వచ్చాయి. కొత్త నానుడిగా ప్రాచుర్యం పొందిన 'ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది' అనడం వెనుక ఈ కంప్యూటర్లే ప్రధాన ఉత్పత్తి వనరులయ్యాయి. ఇక స్మార్ట్‌ ఫోన్లు వినియోగంలోకి వచ్చాక సమాచార వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. ఇంటినుంచి కదలకుండా మనం అలవోకగా, ఎంతో సులభంగా చేసేస్తున్న రైలు, బస్సు, విమానాల్లో ప్రయాణ టికెట్ల బుకింగ్‌, నగదు అవసరం లేకుండా ఒకరినుంచి మరొకరికి చెల్లింపులు, చిరునామా తెలిస్తే చాలు-ఎవరినీ అడగక్కర్లేకుండా కూడా బంధుమిత్రులను కలిసేందుకు జిపిఎస్‌ మ్యాప్‌ చూసుకుంటూ తేలిగ్గా వెళ్ళగల సౌకర్యం- ఇలా ఒకటేమిటి ప్రతీ రంగంలోనూ కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. అనేక రకాల యాప్‌లు, ప్రోగ్రామ్లు వాడుకుంటూ మనం ఈ సదుపాయాలన్నీ అనుభవిస్తున్నాం. వీటి వినియోగం వెనుక సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ల కషి, అంతులేని శ్రమ దాగి ఉన్నదన్నది వాస్తవం. వేలాది కంపెనీలు, లక్షల్లో ఉద్యోగులు, లక్షల్లో జీతాలు, సౌకర్యవంతమైన జీవితాలు ఇవీ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లపై సామాన్య ప్రజలకు సాధారణంగా ఉండే భావన. ఆ జీవితాల కథ ఏమిటో తెలియజేస్తూ ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులు డా. అయ్యగారి సీతారత్నం రాసిన పరిశోధనాత్మక నవల 'సాఫ్ట్‌ లైఫ్‌.'
        సెప్టెంబర్‌ 9, 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ప్రియమైన రచయితల సాహిత్య సంబరాల్లో తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ డా. నందమూరి లక్ష్మీపార్వతి గారిచే ఆవిష్కరింపబడిన ఈ నవలను పరిచయం చేస్తూ సమీక్షకులు డా. పి.కె. జయలక్ష్మి 'ఆశ్చర్యం నుంచి ఆలోచన వరకు ప్రయాణించాను' అన్నారు. ఈ నవలను చదివినప్పుడు మనకి కూడా ఈ మాట నిజమే అనిపిస్తుంది. ప్రముఖ రచయిత్రి ఓల్గా రాసిన ముందుమాటలో 'భూమిని నమ్ముకున్న రైతులు, గాలిని నమ్ముకున్న ఈ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తరమబడుతున్నారు. వ్యవసాయం వేల సంవత్సరాల వత్తి. సాఫ్ట్‌ వేర్‌ నిన్నమొన్నటిది. ఐనా బతుకు భయం ఇద్దరినీ వెంటాడుతూనే ఉంది. వర్తమాన సమాజంలో పైకి కళ్ళు జిగేల్‌ మనిపించే అద్దాల సౌధపు ఆఫీసులలో, చల్లని వాతావరణంలో, నిరంతరం పొగలు కక్కే కాఫీలు, టీలు అందుబాటులో ఉండే పరిసరాల్లో మెలిగే, తిరిగే, పనిచేసే ఉద్యోగుల జీవితాలలో రకరకాల భయాలు, ఆందోళనలు, అలసటలు, కోల్పోతున్న జీవితానందాలు, తెలిసీ ఆ ఆనందాలను జీవితాల్లోకి తెచ్చుకోలేని విరామంలేని బతుకులు.. ఇదీ సాఫ్ట్‌ లైఫ్‌ సారాంశం'' అంటారు. ఆమాటకొస్తే ఒక్క సాఫ్ట్‌ వేర్‌ రంగంలోనే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన వేగంవల్ల, సత్వరమే పని జరిగిపోవాలన్న తీవ్ర కాంక్ష వల్ల పని ఒత్తిడి ప్రతి వత్తిలోనూ పెరిగిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ఉద్యోగుల జీవితాలు గుండెపోటు వల్లో, అకాల అనారోగ్యాల వల్లో అర్థంతరంగా ముగిసిపోవడం గమనిస్తున్నాం. కొన్ని సంస్థల్లో గహసంబంధమైన బాధ్యతలు తీరకపోయినా ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు పాల్పడుతున్నారు. ఆయా ఉద్యోగులు పడుతున్న సంఘర్షణ కారణంగా జీవితానికీ వత్తికీ మధ్య సమన్వయం సాధించడం అంత సులభం కావడంలేదు. నిజానికి ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళే స్థితీ కాదు. యాజమాన్యాలు అవి ప్రభుత్వ శాఖలైనా, ప్రైవేటు శాఖలైనా కంప్యూటర్లున్నాయి, సాఫ్ట్‌ వేర్‌ ప్రోగ్రామ్లున్నాయి కదా, క్షణాల్లో పని జరిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. మానవీయకోణాన్ని మరచిపోతున్నాయి.
         ఇంతకుముందు చెప్పినట్టు ఈ నవలలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల సాధకబాధకాలు, సమస్యలు, యాజమాన్యాలు నిర్దేశించే టార్గెట్లకోసం వారు శ్రమించే విధానాలపై సవివరంగా చర్చించారు రచయిత్రి. ఇద్దరు స్నేహితురాళ్ళు, వారికి కంపెనీలో టార్గెట్లు పెట్టే చండశాసనుడిలాంటి సి.ఇ.ఓ., ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తూ అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయి కేన్సర్‌ రోగి అయిన భార్యను రక్షించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ మరో ఉద్యోగి, ఆ ఆత్మహత్యకు కారకుడని సి.ఇ.ఓ.ని అందరూ తప్పుపడితే ఆ అలజడిని శాంతింపజేసే కొత్త ఉద్యోగి.. వీరి మధ్య జరిగే కథ ఈ నవలలోని అంశం. విషాదం ఏమిటంటే, ఇద్దరు స్నేహితురాళ్ళలో ఒక అమ్మాయి క్యాబ్‌ డ్రైవర్‌ వల్ల అత్యాచారానికి గురవుతుంది. అలాగే ఆ కంపెనీ సిఇఓది మరో విషాదం. అతడు ఓ పుంసత్వం లేనివాడు. పెళ్ళి, పిల్లలు, కుటుంబం అనేవి లేకుండా ఒంటరి జీవితం గడుపుతూ కంపెనీని అభివద్ధి పరచడమే లక్ష్యంగా బతుకుతూ, చివరికి ఓ ఇద్దరు అనాథ బాలలను దత్తత చేసుకొని పెంచుకుంటూ ఉంటాడు. అంత చండశాసనుడిగా పేరు తెచ్చుకున్నా తనకు కూడా మంచితనం, సహాయం చేసే గుణం ఉందని నిరూపించుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న తన కంపెనీ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటాడు.
      నవల ఎత్తుగడ, కథనం, సంభాషణలు, కొన్ని ఊహకు దొరకని ముడులు, వాటిని విప్పిన విధానం, తక్కువమంది పాత్రలతో నవలను అద్భుతంగా, ఏకబిగిన చదివేలా తీర్చిదిద్దారు డా. సీతారత్నం. ఆమె మంచి వక్త. ఆమె మాట్లాడుతూంటే ఒక వేగం, ఒక ఉద్వేగం కనిపిస్తాయి. అదే వేగం కథనంలోనూ, ఆమె రాసిన సంభాషణల్లోనూ కనిపిస్తాయి. నవలలోని కొన్ని మంచి వాక్యాలను ప్రస్తావించడం పాఠకులకు ఆసక్తి కలిగిస్తుంది.
''నాలో దైవకణాలనుండీ వచ్చే ఎనర్జీ ఎక్కువ...''
''నరకంలో నాలుగు నిముషాలే ఉండాలి.''

డా. సీతారత్నం స్త్రీవాద రచయిత్రి. ఆమె రాసిన సంభాషణల్లో ఆ భావాల తాలూకు ఉద్రేకం ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. 'అందుకనే న స్త్రీ స్వతంత్రమర్హతి అన్నారనిపిస్తుంది' అని మురళీధర్‌ అంటే వెంటనే కథానాయికల్లో ఒకరు అతని కాలర్‌ పట్టుకొని 'లేరా, ముందు మగవెధవలకు నిగ్రహం లేక, చొంగలు కారుస్తారని మేం జాగ్రత్తగా పరదాలేసుకొని... వంటింట్లో ఉండాలా... పశువుల్లా మీరుంటారా బుద్ధిజీవులు కారూ నిగ్రహంగా ఉండలేరూ మాకు కండిషన్స్‌ పెడతారా షూట్‌ చేసి పారేస్తా పనికిమాలిన వొపీనియన్స్‌ చెప్తే... మార్చుకో, నీ దక్కోణం మార్చుకో' అంటుంది.
          అలాగే మరోచోట 'నా స్వేచ్ఛని జీవనాన్ని హరించే అభిప్రాయాలు ప్రచారం చేస్తే చీల్చేస్తాను. నువ్వేంటన్నావ్‌? చీర కట్టుకోవాలా? అది భారతీయ సంస్క తి. దుర్యోధన, దుశ్శాసన సంతతిలా మీరు చీర కట్టుకొని అంత:పురం లోపల ఉన్న ద్రౌపదిని ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేస్తారు? ఇది మీ సంస్క ృతి'' అంటారు. ఆలోచనాత్మకమైన ఇలాంటి సంభాషణలెన్నో ఈ నవలలో ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే, మనం ఎప్పుడో వాడటం మానేసిన 'ఱ'ను అవసరమైన చోట వాడి మనకి 'ఱ' వాడకం పట్ల అవగాహన కల్పించారు. ఉదాహరణకి 'దుడ్డుకఱ్ఱ', 'బుఱ్ఱ', 'ఎఱ్ఱగా' ఇలా...
         'తెలుగు వెలుగులు వెదజల్లుతూ అక్షరాన్ని ఆరాధిస్తున్న ఉత్తమోత్తమ ఉపాధ్యాయిని ఆచార్య అయ్యగారి సీతారత్నం. విద్యార్థులకు విద్యాబోధన చేస్తూనే సాహిత్య సేవలో తెలుగు అక్షరాలకు అలంకారంగా నిలబడ్డ సాహిత్య విదుషీమణి' అన్నారు నవలను ప్రచురించిన ప్రియమైన రచయితల తరపున ప్రముఖ కథ, నవలా రచయిత ఇందూ రమణ. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాలపై దృష్టి సారించి ఓ మంచి నవల రాసిన డా. సీతారత్నం అభినందనీయులు.
 

- కొంపెల్ల కామేశ్వరరావు