Sep 26,2022 07:46

నెల రోజులుగా నెలరాజు పత్తా లేడు
ఏకవర్ణ వరద చాపం
పురి విప్పడంతో
నేలతల్లి ముఖమూ కనబడడం లేదు
మనిషి ముఖమూ కనబడడం లేదు
నెల రోజులుగా నెలరాజు పత్తా లేడు
వెన్నెల వసించడం లేదు వసారాల్లో
వన శిఖరాలు మటుమాయమవుతూ
ధన శిఖరాలు పుట్టుకొస్తున్నాయి!
అగ్నిశిఖల దేహాలని రచిస్తున్నాయి కుంచెలు!
అక్షరమాలని కోల్పోయింది వీచే గాలి!
శోకాలకి విరుగుడైన శ్లోకాలు వింటున్నా
తుప్పు పట్టిపోతున్నాయి శిరస్సులన్నీ!
గిరుల కోసం ఉరుకులాట
తరుముకొస్తున్న వరదలకి
ఊరు వొదిలి, చెరువు వొదిలి ఒకటే పరుగు

ఆగని పరుగు, అతిసార పరుగు
వొళ్ళంతా కాళ్ళైన పరుగు!
కరకు కరకు కరోనాల్లాంటి
విషబీజాల విద్వేషాల శత్రు గుణ లోభ లాభాల సంతల్లో
రాలి ముడుచుకున్న ఆకులన్నీ
మాంస భక్షణలో మిగిలిన బొమికెల్లాగున్నాయి!
గదులన్నీ తాళ్ళతో బంధించబడి
వినోద విష రసాలని పీల్చుతూ
వెన్నెలా, వెలుగూ చూడని
పత్రహరిత శ్వాసలు కోల్పోతూ
ఏకవర్ణ వరద చాపం కింద మనిషి !
.....


ఓ పొద్దున్నే
గోదారి వంతెన మీదనుంచి చూస్తే
నదిలో గుడిసెలా తేలిన చంద్రుడు!

- ఒబ్బిని
98495 58842