ప్రజాశక్తి-గుడివాడ
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23వ తేదీన జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సమరం అన్నారు. శనివారం గుడివాడ నియోజకవర్గంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులుచే బంద్ పోస్టర్లును ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సమరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో 2018 సంవత్సరం విడుదల చేసినటువంటి మెస్ బిల్లులే ఇప్పటికీ అమలు అవుతున్నాయని అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, పెంచిన విద్యార్థుల బస్ చార్జీలను తగ్గించాలని, పాఠశాలల విలీనం ప్రక్రియ తక్షణమే నిలిపివేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు రాలేదని, తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అమలులోఎటువంటి షరతులు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు కల్యాణ్ లోకనాథ్ రాజేష్ పావని శశిరేఖ అరుణ్ తదితర విద్యార్ధులు పాల్గొన్నారు.










