అమరాపురం: ఇంటి వద్దనే రేషన్ బియ్యాన్ని అందిస్తాం అన్న ప్రభుత్వం మాటలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రేషన్‌షాపుల వద్దనే పంపిణీ జరుగుతోంది. షాపుల వద్ద నుంచి బియాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు ఎక్కడున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మడకశిర నియోజకవర్గంలోని చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితి కన్పిస్తోంది. అమరాపురం మండల పరిధిలోని కెంకెర గ్రామంలో గురువారం నాడు రేషన్‌షాపు ద్వారా బియ్యం పంపిణీ చేశారు. దుకాణంలో రేషన్ బియ్యం తీసుకున్న ఓ వికలాంగురాలు దానిని మోసుకెళ్లలేక ఆ బియ్యం మూటను పక్కన ఉంచుకుని షాపు వద్దనే కూర్చొంది. బియ్యాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు ఇతరుల సాయం కోరుతూ కన్పించింది. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం తీసుకెళ్లే వాహనాలు ఎక్కడికెళ్లాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో రేషన్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










