ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నవీన, అంతర్జాతీయ సాంకేతికతలను సత్వరమే అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపు, సామర్థ్యానికి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌్ దాస్ అన్నారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాల తగ్గింపుపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఎపిఎస్‌ఇసిఎం అధికారులతో ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో సిఎస్ మాట్లాడారు. బిఇఇ అంచనా మేరకు రాష్ట్రంలో విద్యుత్ 67500 మిలియన్ యూనిట్ల (ఎంయు)లో 25శాతం (16875) ఆదా చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా కరెంటు బిల్లులు తగ్గి ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ డిఎస్‌ఎం, గ్రామపంచాయతీల్లో వీధిలైట్లు, కేంద్రప్రభుత్వ పథకాలు పిఎటి, ఉజాలా వంటి వాటితో 2932 ఎంయు ఆదా అయిందని, ఇది ఏడాదికి రూ.2014 కోట్లతో సమానమని తెలిపారు. మరో 14000 ఎంయు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. శాఖల వారీగా ఇంధన సామర్ధ్య కార్యక్రమాల పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ఇంధన శాఖ కార్యదర్శికి సూచించారు. బిఇఇ ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో 0.49 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ ఇంధన పొదుపుతో రూ.3,340కోట్లు ఆదా అయ్యాయని, 1.62 ఎంయుల కార్బన్ డయాక్సైడ్ తగ్గిందన్నారు. పరిశ్రమలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పప్పులు, స్పిన్నింగ్, కోల్డ్‌స్టోరేజ్, ఎంఎస్‌ఎంఇ క్లస్టర్లలో ఇంధన ఆడిట్ చేసేందుకు కూడా బిఇఇ నిధులు మంజూరు చేసిందని కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఎంఎస్‌ఎంఇల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం అందించాలని కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.










