Aug 14,2022 22:17

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
శ్రావణ మాసం, ఆదివారం సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారరులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆల ఇఓ భ్రమరాంబ క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహాోమం, శాంతికళ్యాణం ఇతర సేవలలో విశేషంగా పాల్గొని, శ్రీ అమ్మవారిని స్వామివారిని యాత్రికులు దర్శించుకున్నారు.
అమ్మవారి అలంకరణకు ఐదు కేజీల వెండి బిస్కెట్లు విరాళం
విశాఖపట్నంకు చెందిన అంబటి సంతోష్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా ఆదివారం ఆలయ అధికారులను కలిసి ఐదు కేజీల బరువు కలిగిన 17 వెండి బిస్కెట్‌లను దేవస్థానం అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.