Feb 12,2023 22:18

ఫొటో : ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు

ఇళ్ల మధ్య బార్‌ అనుమతి సరికాదు
ప్రజాశక్తి-కావలి : ఇళ్ల మధ్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అనుమతి ఇచ్చిన వైసిపి ప్రభుత్వాన్ని ఓడించాలని సీనియర్‌ జనసేన నాయకులు తోట వెంకట శేషయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నాయకుడు సిద్ధు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన కావలి పట్టణంలో అనైతిక విలువలతో వైసిపి నాయకులు దోపిడీ రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. చివరకు ప్రజల జీవితాల మనుగడలకు కూడా భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని 30వ వార్డులోని బంగ్లావీధి, రాజావీధి, ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు అన్నారు. వైద్యశాలలకు, పాఠశాలలకు నిలయం అన్నారు. కూతవేటు దూరంలో మున్సిఫ్‌కోర్టు, సబ్‌కోర్టు కల్యాణమండపాలు, బ్యాంకులకు ప్రజల రాకపోకలు అనుదినం సాగిస్తున్నారని తెలిపారు.
అలాంటి గౌరవ ప్రతిష్టతలకు కలిగిన వీధిలో ఇళ్ల మధ్యన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను పెట్టేందుకు అనుమతినిచ్చిన వైసిపి నాయకులను, మున్సిపల్‌ కమిషనర్‌లను ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షులు తోట వెంకటశేషయ్య మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఎన్‌.ఒ.సి. ఇచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలను విజిలెన్స్‌ వారితో విచారించి, తగు చర్యలు తీసుకుకొని, నివాసాల మధ్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను తొలగింపజేయాలని కలెక్టరుకు విజ్ఞప్తి చేస్తుందన్నారు.