ప్రజాశక్తి-హిందూపురం హిందూపురం పట్టణంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మారిపోయింది. ఈ ఆసుపత్రిలో 19 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా..ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కార్మికులు, పరిశ్రమ యాజమాన్యాల నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్లుగా నాణ్యమైన వైద్యం మాత్రం అందడం లేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రి సేవలను పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఎప్పటినుంచో కోరుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు నిట్టూర్చడం తప్ప చేసేదేమీ లేకుండా పోతోంది.
సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన
జిల్లాలో కార్మికుల కోసం ఉండే ఒకే ఒక్క అసుపత్రి ఈఎస్‌ఐ అసుపత్రి అని, ఈ అసుపత్రిలో సిబ్బంది లేక కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని, వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి అవసరమైన మందులను సరఫరా చేయాలని సిఐటియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు జెడ్‌పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జెడ్‌పి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి నరసింహప్పలు మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆసుపత్రి పరిధిలో దాదాపు 40 వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందాలన్నారు. హిందూపురం చుట్టుపక్కల ఉన్న మండలాల్లో వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు వారి వేతనాల నుంచి ప్రతి నెలా ఈఎస్‌ఐ చెల్లిస్తున్నప్పటికీ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఆసుపత్రిలో 19 మంది సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికి కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారన్నారు. ఉన్నవారూ సక్రమంగా పనిచేయటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని, పూర్తి స్థాయిలో మందులను సరఫరా చేసి, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకుని వాటికి సంబంధించిన బిల్లులను సమర్పించి ఆరు నెలలు గడుస్తున్నా మంజూరు చేయడం లేదన్నారు. ప్రతి నెలా కార్మికులు ఈఎస్‌ఐ చెల్లిస్తూ, వైద్య సేవల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈఎస్‌ఐ కార్డు ఉన్నవారికి వైద్య సేవలు అందించడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమేనని పేర్కొన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఈఎస్‌ఐ రూపంలో కార్మిక వేతనాలు నుంచి కోత విధించి ఖజానా నింపుకుంటోందే తప్ప కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించిందన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలు దఫాలు ఆందోళనలు చేసి వినతులు సమర్పించినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అప్పటికీ సమస్యలను పరిష్కరించకపోతే ఆసుపత్రి ఎదుట నిరవదిక నిరాహార దీక్షకు సిద్ధమవుతామవుతామని హెచ్చరించారు. అనంతరం ఈఎస్‌ఐ డాక్టర్ ధనలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సదాశివరెడ్డి, సిఐటియు పట్టణ కర్యదర్శి నరసింహప్ప, ప్రీ ప్రికాట్ బి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయరాంరెడ్డి, కోశాధికారి నందీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున, రామచంద్ర, బాబయ్య, మూర్తి, ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి రామకృష్ణ, ఐరన్ ఫర్నీచర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జబీవుల్లా, స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.










