- విద్యార్థి కులాన్ని తెలుసుకోవాలనేదే ఉద్దేశం
- ఐఐటి- బాంబేలో అధ్యాపకులు, తోటి విద్యార్థుల తీరు
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు
- 37శాతం మంది దళిత, ఆదివాసీ స్టూడెంట్స్‌కు ఇదే అనుభవం
న్యూఢిల్లీ : భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థలనూ కులజాఢ్యం వీడటం లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అక్కడా కుల వివక్షను, అవమానాలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అధ్యాపకులు సైతం అదే దారిని అవలంభిస్తున్నారు. ఇందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-బాంబేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ అధ్యాపకులు, తోటి విద్యార్థులు.. కులాలను తెలుసుకునేందుకు ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులను, వారు సాధించిన మార్కులను అడుగుతున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అక్కడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఐఐటీ-బాంబే అంతర్గత సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
వాస్తవానికి ఐఐటీ-బాంబే వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ విద్యార్థులకు తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చినా ప్రవేశం పొందడానికి రిజర్వేషన్ కింద సంస్థలో సీటు వచ్చే అవకాశాలుంటాయి. దీని ఆధారంగానే ప్రవేశ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంకు ఎంత? అని ఇతర విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అడిగిన ఘటనలు క్యాంపస్‌లో చాలా చోటు చేసుకున్నాయని ఈ సర్వేలో తేలింది.
గత నెల దళిత విద్యార్థి ఆత్మహత్య
క్యాంపస్‌లో గతనెల 12న దళిత విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌కు చెందిన సోలంకి (18) ఐఐటీ-బాంబేలోని బ్యాచ్‌లర్స్ టెక్నాలజీ (కెమికల్) కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి. అయితే, క్యాంపస్‌లో కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సోలంకి తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం సోలంకి మరణంపై దర్యాప్తు జరపడానికి ఒక కమిటీ సైతం ఏర్పాటైంది. ఈ ఘటన తర్వాతే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ సెల్ సేకరించిన పై సమాచారం బహిర్గతమైంది.
ఈ సర్వేను గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించారు. అయితే, ఈ సర్వేలో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌లో తాము కుల వివక్షను ఎదుర్కొన్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సెల్.. క్యాంపస్‌లో దళిత, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 2000 మంది విద్యార్థులను సంప్రదించి వారిని పలు ప్రశ్నలు వేసింది. 388 మంది విద్యార్థులు దీనికి స్పందించారు. క్యాంపస్‌లో ఫ్యాకల్టీ సభ్యులు, తోటి విద్యార్థుల నుంచి వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు.
రిజర్వేషన్‌పై జోకులు
పెత్తందారీ కులాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్‌లో బహిరంగంగానే కులం, రిజర్వేషన్ వ్యతిరేక జోకులు, మీమ్స్, పాటలు షేర్ చేశారని 93 మంది చెప్పారు. కులానికి సంబంధించిన జోకులు, మీమ్స్ వంటివి అధ్యాపకుల నుంచి సైతం ఎదుర్కొన్నామని విద్యార్థులు వెల్లడించారు. ఇక తమ కులాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమను ఇంటి పేర్లు అడిగిన సందర్భాలున్నాయని దాదాపు 26 శాతం మంది విద్యార్థులు చెప్పారు.
క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అవమానకర పరిస్థితులు, కుల వివక్ష గురించి సర్వేకు మాత్రమే పరిమితం కాని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సెల్.. విద్యాసంస్థలో గతేడాది జూన్‌లో ఓపెన్ హౌజ్‌నూ నిర్వహించింది. ఇందులో దళిత, ఆదివాసీ విద్యార్థులు పాల్గొని కుల వివక్ష విషయంలో తాము ఎదుర్కొంటున్న అనుభవాలను వెల్లడించారు. తాను మీనా కులానికి చెందిన విద్యార్థిని కావడంతో తన పేపర్‌ను చెక్ చేయడానికి అధ్యాపకులు ఒకరు నిరాకరించారని ఒక విద్యార్థి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. కాలేజీకి తొలి రోజుల్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో తనను ర్యాంకు, కేటగిరిని అడిగారనీ, ఇది తనను ఇబ్బందికి గురి చేసిందని మరొక విద్యార్థి చెప్పారు.
ఈ పరిస్థితులు ఒక్క ఐఐటీ-బాంబేకు మాత్రమే పరిమితం కాలేదనీ, దేశవ్యాప్తంగా అనేక ఉన్నత విద్యాసంస్థల్లోనూ కుల వివక్షతతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బాధిత విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనీ, విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోయేలా చేస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, కాలేజీ యాజమాన్యాలు పటిష్ట చర్యలు తీసుకొని విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నదని వారు తెలిపారు.










