ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన వారికి దేశ, విదేశాలలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. చెన్నైస్ అమిర్త ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నూతన శాఖ సిద్దార్ద నగర్‌లో సోమవారం మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్టాడుతూ హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో ఎన్నో కోర్సులు ఉన్నాయని వాటి వల్ల ప్రతి ఒక్కరికీ నూరుశాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పర్యాటకంగా మన రాష్ట్రంతో పాటు దేశంలోనూ చక్కటి అభివృద్ధి జరుగుతుందని దీనితో హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో అగ్రగామిగా ఉన్న చెన్నరు అమిర్త సంస్థ నూనత శాఖ విజయవాడ నగరంలో ఆధునిక స్థాయిలో ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఒకప్పుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వచ్చేదన్నారు. నేడు విజయవాడ నగరంలో స్టార్ హోటల్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ది సాధించిందన్నారు. దీనితో ప్రముఖ సంస్థలన్నీ ఇక్కడే వచ్చాయని తెలిపారు. చెన్నరు అమిర్త హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల విజయవాడ శాఖ ప్రిన్సిపల్ బుట్టా కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు తమ సంస్థ బెంగుళూరు, చెన్నరు, హైదరాబాద్ నగరాలలో మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఈ కోర్సును అందించాలనే ఉద్దేశంతోనే విద్యార్థుల కోరిక మేరకు విజయవాడలో అత్యాధునిక వసతులతో కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, చెన్నరు అమిర్త రీజనల్ ప్రిన్సిపాల్ నవనీత్ పాల్గొన్నారు.










