''అందరూ శాకాహారులే, కాని బుట్టలో రొయ్యలు మాయం'' అన్న చందాన ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచీ ఇదే పరిస్థితి. అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాం, హోదా ఇస్తాం, ప్రాజెక్టులు నిర్మిస్తాం, ఇంకా ఏవేవో చేసేస్తాం అంటూ ఊదరగొట్టినవారే. కాని ఆచరణలో మాత్రం పురోగతి ఎక్కడా కనిపించడం లేదు.
ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, వై.ఎస్.ఆర్.సి.పి, టిడిపి నేతలు ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే మతి పోతుంది. అందరూ ప్రత్యేకహోదా గురించి సమర్ధిస్తూ మాట్లాడుతున్నవారే. కాని హోదా ఇవ్వవలసిన కేంద్ర ప్రభుత్వం బిజెపి చేతుల్లో ఉంది. ఆ పార్టీ నేతలు తాము హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు కాని ''ముఖ్యమంత్రి జగన్ ఎందుకు అడగడం లేదు?'' అని మాత్రం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబే హోదా రాకుండా అడ్డుకుంటున్నాడని వై.ఎస్.ఆర్.సి.పి నేత పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడం ఏవిధంగా సాధ్యమో ఎంత తల బద్దలుకొట్టుకున్నా ఆర్ధం కాని విషయం. ఇక టిడిపి నేత చంద్రబాబు ''ప్రత్యేక హోదాపై యుద్ధం ఎప్పుడు?'' అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఎవరిపై యుద్ధం చేయాలి? తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత యుద్ధం చేశారు? ప్రత్యేక హోదా స్థానే ప్రత్యేక ప్యాకేజీ అన్న మాట అసలు ఎందుకొచ్చింది? ఈ విషయాల గురించి చంద్రబాబు నోరెత్తరు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నడుమ విభజన సంబంధిత అంశాలలో ఇంకా పరిష్కారం కావలసిన విషయాలపై ఉభయ రాష్ట్రాల అధికారులతోనూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్చలు ఫిబ్రవరి 17న జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ వేడెక్కింది. చర్చించవలసిన ఎజెండాలో ఉన్న తొమ్మిది అంశాలలో ప్రత్యేక హోదా అంశాన్ని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, పన్ను రాయితీలు, రెవెన్యూ గ్యాప్ ఫండింగ్ అంశాలను ముందు చేర్చారు. తర్వాత తొలగించారు. ఎందుకు తొలగించారో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంతవరకూ ఏ వివరణా ఇవ్వలేదు. జగన్ అడగలేదు కాబట్టి తొలగించారని చంద్రబాబు, ''ఆ నలుగురు ఎంపీల ద్వారా'' - అంటే గతంలో టిడిపిలోఉండి ప్రస్తుతం బిజెపిలో చేరిన ఎంపీల ద్వారా-హోదా అంశాన్ని ఎజెండాలో లేకుండా చేసింది చంద్రబాబేనని పెద్దిరెడ్డి పరస్పరం విమర్శించుకుంటున్నారు. అంతే తప్ప ఎందుకు ఎజెండా నుండి తొలగించారని ఈ ఇద్దరూ బిజెపి ని మాత్రం అడగడం లేదు. ఈ రెండు పార్టీల వైఖరీ చూస్తుంటే, హోదా రాకపోయినా పర్వాలేదు కాని, అలా రాకపోడానికి కారణం అవతలి పార్టీయేనని రుజువు చేయడమే ప్రధానం అన్నట్టు ఉంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల వైఖరి ఈ విధంగా ఉండడంతో బిజెపి పండుగ చేసుకుంటోంది.
ప్రత్యేక హోదా ప్రస్తావన తొలుత తెచ్చిందే బిజెపి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళపాటు హోదా ఇస్తానని అంటే తమ నాయకుడు వెంకయ్య నాయుడు పట్టుబట్టి పదేళ్ళ హోదాకు పార్లమెంటు సాక్షిగా అంగీకరింపజేశారని, తమను, తమ మిత్ర పక్షంగా ఉన్న టిడిపిని బలపరిస్తే ప్రత్యేక హోదా ఖాయం అని తిరుపతి సభలో స్వయానా మోడీ ప్రకటించారు. దానిని నమ్మిన తెలుగు ప్రజలు ఆ కూటమికి అధికారం కట్టబెట్టారు. మరి ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమైంది? ఇంతవరకూ దానికి అతీ గతీ ఎందుకు లేదు? అప్పటి నుంచీ ఇప్పటి దాకా అధికారంలో కేంద్రంలో బిజెపియే ఉంది కదా? హోదా ఇవ్వవలసినది కేంద్ర ప్రభుత్వమే కదా? పార్లమెంటులో ఒకసారి నిర్ణయం అయిపోయింది కదా? అయినా ఎందుకు ఇవ్వలేదు?
మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి అందరికన్నా ముందు ఆంధ్రరాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినది బిజెపి నే. కొన్ని సంవత్సరాలు ఊరుకుని హఠాత్తుగా ''ప్రత్యేక హోదా రాదు, ఇవ్వడానికి నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదు, ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదు, అందుచేత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'' అని ప్రకటించింది బిజెపి యే. దానికి అంగీకరించిన చంద్రబాబు రెండో ముద్దాయే ఔతారు తప్ప మొదటి ముద్దాయి మాత్రం ముమ్మాటికీ బిజెపి. ఒకసారి పార్లమెంటులో విభజన చట్టం మీద జరిగిన చర్చలో భాగంగా, ఆ సందర్భంలో ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన హామీ కూడా చట్టంతోబాటు అమలు చేయవలసిన అంశమే ఔతుంది. కనుక నీతి ఆయోగ్ అడ్డుపడిందని చెప్పడం అర్ధరహితం. పార్లమెంటు కన్నా నీతి ఆయోగ్ కున్న అధికారాలు ఎక్కువేమీ కాదు కదా? ఇక ఏ ఇతర రాష్ట్రానికీ ఇవ్వడం లేదు అన్న వాదన కూడా అసందర్భం. అన్ని ఇతర సందర్భాలలోనూ రాజధాని సమస్య కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వచ్చింది. కాని ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఉన్న రాజధాని లేకుండా పోయింది. ఈ ఒక్క కారణం చాలదా ప్రత్యేక హోదా ఇవ్వడానికి?
ఆంధ్రప్రదేశ్ పట్ల వీసమెత్తు బాధ్యత ఉన్నా బిజెపి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏయే ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలో వాటిని ముందు పెట్టాలి. అంతే కాని ఎందుకు హోదా ఇవ్వకూడదో చెప్పడానికా బిజెపి నేతలు ఉన్నది?
తాజాగా ఆ పార్టీ నేత జివిఎల్ గొప్ప ''ఇలవైన మాట'' శలవిచ్చారు. హోదా ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి తామెవరమని, తమ చేతుల్లో ఏముందని అంటూ, ఒకసారి మోడీ, అమిత్‌షా నిర్ణయించాక అదే తమకు శిరోధార్యం అని ఆయన చెప్పారు. ''అయ్యా! జివిఎల్ గారూ! ఆ మోడీ గారే కదా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇచ్చేది తమ పార్టీయేనని ఘంటాపధంగా చెప్పారు? మళ్ళీ ఆ మోడీగారే కదా నీతి ఆయోగ్ పేరు చెప్పి తప్పించుకున్నారు? పోనీ, ఇప్పుడైనా మీరు చెప్పండి, నీతి ఆయోగ్ వద్దంది కాబట్టి హోదా ఇవ్వలేదా? లేక మోడీ, షా ఇవ్వకూడదనుకున్నారు కాబట్టి ఇవ్వలేదా? లేక, మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఓట్లు, సీట్లు రాలేదు కాబట్టి కక్ష కొద్దీ ఇవ్వడం లేదా? లేక మీ పార్టీ వెనకనున్న కార్పొరేట్-అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కూటమి ఆదేశాల మేరకు ఇవ్వడం లేదా? లేక తెరవెనక నుండి మీ ప్రభుత్వాన్ని నడిపించే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం 'ఒకే దేశం, ఒకే పన్ను, వగైరా ప్రకారమో, రాష్ట్రాలకు ఏ అధికారాలూ లేకుండా వాటిని నిర్వీర్యం చేసే కేంద్రీకృత పెత్తనపు విధానం ప్రకారమో ఇవ్వడం లేదా?''
బిజెపి నేతలు మాట్లాడేదానిలో ఒకరికి, ఇంకొకరికి పొంతన ఉండదు. అది వారి స్ట్రాటజీ. ఒకపక్క జివిఎల్ గారు హోదా అంశాన్ని, రెవెన్యూ గ్యాప్ ఫండింగ్ అంశాన్ని ప్రత్యేకంగా ఎజెండాగా పెట్టి దానిని తేల్చడానికి ఒక ప్రత్యేక కమిటీని కేంద్రం వేయాలని ప్రకటిస్తారు. అదే రోజున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటిస్తారు (ది హిందూ 15-2-22, విజయవాడ ఎడిషన్ పేజీ-4). ముగిసిన అధ్యాయానికి మళ్ళీ కమిటీ ఎందుకు? ఏమిటీ నాటకం? ప్రత్యేక హోదా ఊసెత్తేముందు పోలవరానికి ఇచ్చిన నిధుల్ని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి వాపసిస్తుందా? అని విష్ణువర్ధనరెడ్డి గారు సవాల్ విసిరారు. హోదా ఇవ్వనిది, తాజాగా ఎజెండాలో పెట్టినది, మళ్ళీ తొలగించినది, ఇప్పుడు హోదా కావాలంటే ఇచ్చిన నిధుల్ని వాపసివ్వమంటున్నది-అంతా బిజెపి నేతలే. ఇంతకన్నా వెటకారం ఉంటుందా?
ఇంత నాటకమూ ఒక్క హోదా విషయంలోనే. ఇక విశాఖ ఉక్కు విషయంలోనైతే రాష్ట్రం యావత్తూ ఒకే మాటగా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఐనా దాని గురించి రాష్ట్ర బిజెపి నేతలు నోరెత్తరు. రైల్వే జోన్ విషయం చూస్తే అది ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. మొన్న బడ్జెట్‌లో దానికి మిగిలింది శూన్య హస్తమే. పోలవరం నిధులు, పునరావాసం, వెనకబడిన ప్రాంతాల ప్యాకేజిలు, కేంద్ర విద్యా వైద్య సంస్థలకు నిధుల విడుదల- అన్నింట్లోనూ ఎగనామమే పెట్టారు. జిఎస్‌టి వాటా, రెవెన్యూ గ్యాప్ ఫండింగ్ సంగతి చెప్పనక్కరలేదు.
కాని మరోపక్క రాష్ట్రంలో నూతన విద్యా విధానం, విద్యుత్ సంస్కరణలు, మునిసిపల్ సంస్కరణలు, మోనిటైజేషన్ పైప్‌లైన్ విధానాలు అన్నీ శరవేగంతో అమలౌతున్నాయి. వాటిని అమలు చేస్తేనే అప్పు మరింత చేసేందుకు అనుమతులు ఇస్తామని మడతపేచీ పెట్టిందే బిజెపి ప్రభుత్వం.
ఇంత అన్యాయం చేస్తున్నా, తామే ఈ రాష్ట్రానికి దిక్కు అని చెప్పుకోడానికి మాత్రం ఏ మాత్రమూ జంకు, గొంకు లేకుండా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర బిజెపి నేతలు!
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలో గాని, పార్లమెంటులో ప్రతిఘటించడంలోగాని అధికార వై.ఎస్.ఆర్.సి.పి ఘోరంగా విఫలమైంది. విజ్ఞప్తులకు, వేడికోళ్ళకే పరిమితం అవుతోంది. మారు మాట్లాడకుండా కేంద్రం విధిస్తున్న షరతులను, ముందుకు తెస్తున్న ప్రజా వ్యతిరేక సంస్కరణలను అమలు చేస్తోంది. అది కూడా చాలా దూకుడుగా, బిజెపి-పాలిత రాష్ట్రాలకన్నా ముందుగా అమలు చేస్తోంది. హోదా సాధించడానికి పాతిక మంది ఎంపీలను ఇవ్వమని ప్రజలను ఆ నాడు అడిగిన జగన్ ఈ రోజు చేతులెత్తేయడమంటే అది ప్రజలకు ఇచ్చిన మాట తప్పడమే. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు రాజీ పడడం లేదు. అది తమ హక్కు అనే భావిస్తున్నారు. ఇది తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆ ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరించడానికి వెనకాడుతున్నది. ఈ విషయం మీద చర్చించి కార్యాచరణ రూపొందించడానికి అఖిలపక్ష సమావేశమైనా వేయడానికి జగన్ నుండి ముందడుగు పడకపోవడం శోచనీయం. ఇంతమంది ఇన్ని రకాలుగా ఘోషిస్తున్నా, ముఖ్యమంత్రి మౌనం వహించడం దేనికోసమో బోధపడదు. ప్రజలకు సమాధానం చెప్పనవసరం లేదా? ఇదే వైఖరి కొనసాగితే. హోదాను నిరాకరించిన బిజెపితో బాటు వైఎస్‌ఆర్‌సిపి కూడా సహ ముద్దాయిగా ప్రజాకోర్టులో నిలబడవలసి వస్తుంది.
అధికార పార్టీగా టిడిపి ఉన్నప్పుడు బిజెపితో అంటకాగి నాలుగేళ్ళు ప్రత్యేక హోదా ఊసెత్తకుండా ఊరుకుంది. 2017లో ప్రత్యే ప్యాకేజీకి తలాడించి వచ్చారు చంద్రబాబు. పైగా బిజెపికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సైతం అసెంబ్లీలో ఆమోదింపజేశారు. అదే తీర్మానం మీద చర్చలో శాసనమండలి లోని పిడిఎఫ్ సభ్యులు ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఏం చేశారని నిలదీశారు. దానికి సూటిగా సమాధానం చెప్పలేక చంద్రబాబు నీళ్ళు నమిలారు. 2018లో హోదా కోసం వామపక్షాలు, హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపును రాష్ట్ర ప్రజలు జయప్రదం చేశాక టిడిపి కాస్త పల్లవి మార్చింది. బిజెపి మీద విమర్శలు ఎక్కుపెట్టి ఎన్నికల పోరాటం సాగించింది. కాని ఇప్పుడు అదే బిజెపి తో ఏదోవిధంగా అవగాహనకు వచ్చి మళ్ళీ గద్దెనెక్కాలన్న యావ టిడిపి అధినేతలో కనపడుతోంది. అందుకే హోదా నిరాకరించిన బిజెపిని పల్లెత్తు మాట అయినా అనకుండా వైఎస్‌ఆర్‌సిపి మీదనే ఎక్కుపెడుతున్నారు.
ఇలా రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ బిజెపి ఈ రాష్ట్రానికి చేసిన, చేస్తున్న అన్యాయాన్ని విస్మరించి ఒకదానిపై ఇంకొకటి కత్తులు దూసుకోవడం వలన ప్రజా కోర్టులో అసలు ముద్దాయిగా నిలబడవలసిన బిజెపి తప్పించుకోగలుగుతోంది.
తమ తక్షణ. సంకుచిత ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను, మన హక్కులను పట్టించుకోని ఈ పార్టీల వైఖరులు రాష్ట్రానికి చేటు. తమ రాజకీయ బలం పరిమితమే అయినా, విధానపరంగా సూత్రబద్ధంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యమూ పోరాడుతున్న వామపక్షాల బాటే నేడు ప్రజలంతా నడవవలసిన బాట.
ఎం.వి.ఎస్. శర్మ










