Jul 13,2023 07:13
  • కృష్ణా బేసిన్‌లో పొంచి ఉన్న నీటి ఎద్దడి
  • ఖరీఫ్‌ సాగు ఆలస్యం అయ్యే ప్రమాదం

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి ఎద్దడి పొంచి ఉంది. గతేడాది ఇదే సమయానికి కృష్ణా క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీ వర్షాలు కురిసి దాదాపు వరదలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎగువ నుంచి నీరు రాకపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలశయాల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. రాబోయే పక్షం రోజుల్లో ఎగువ నుంచి నీరు రాకపోతే కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకరగా మారనుంది. గత నెల మూడో వారంలోనే కృష్ణా డెల్టాకు ప్రకాశం బ్యారేజి నుంచి నీరు విడుదల చేసినా ప్రస్తుతం కృష్ణా తూర్పు (ఉమ్మడి కృష్ణా) జిల్లాకు మాత్రమే నీరు ఇస్తున్నారు. పశ్చిమ డెల్టా (గుంటూరు, బాపట్ల జిల్లాలు)కు కేవలం 100 క్యూసెక్కులు మొక్కుబడిగా విడుదల చేస్తున్నారు. దీంతో, ప్రస్తుతం పశ్చిమ డెల్టాలో ఇంత వరకు నారుమళ్లు కూడా పోయలేదు. కేవలం 150 ఎకరాల్లోనే వెదపద్ధతిలో వరి సాగవుతోంది. సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లాలో 25 వేల ఎకరాల్లో పత్తి మాత్రమే సాగు చేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీరు తగ్గిపోవడంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సాగు బాగా ఆలస్యం అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తెలంగాణలో ఖమ్మం, నల్గొండకు కూడా సాగర్‌ నుంచి నీరు విడుదల కావాల్సి ఉంది. సాగర్‌ కాల్వల నుంచి నీటి విడుదలపై ప్రభుత్వం ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. శ్రీశైలానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రావడం లేదు. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 33.71 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాది జులై 12 నాటికి 44.15 టిఎంసిల నీరు నిల్వ ఉంది. సాగర్‌ జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 147.46 టిఎంసిలు ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 165.23 టిఎంసిలు నిల్వ ఉంది. పులిచింతల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 22.92 టిఎంసిలే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 32.83 టిఎంసిల నిల్వ ఉంది. గతేడాది జులై రెండో వారం కల్లా ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాల జలాశయాలకు వరద ప్రారంభమైందని, ఈ ఏడాది ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు లేక ఎగువ నుంచి జలాశయాలకు నీరు రావడంలేదని అధికారులు తెలిపారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టుకు నీరు రావడం ప్రారంభమైందని, ఈఏడాది ఎప్పటికి నీరు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. దీంతో, ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు జాప్యం జరిగే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఖమ్మం, ఎన్‌టిఆర్‌ జిల్లాలు, పులిచింతల దిగువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీంతో, ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 10,803 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు డెల్టాకు 7,244 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1,116 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.