బత్తలపల్లి : తెల్లవారితో శ్రీశైలం మల్లికార్జునస్వామికి ఇరుముడితో వెళ్లాల్సిన గురుస్వామి రాజగోపాల్‌రెడ్డి (88) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన కాటికోటేశ్వరక్షేత్రం ఆలయ ధర్మకర్త, వాటరైడ్ మాజీ ప్రసిడెంట్, వైసిపి నాయకులు రాజగోపాల్‌రెడ్డి ప్రతిఏటా మాఘమాసంలో శివదీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుని శ్రీశైలం బయలుదేరి వెళ్తారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఆలయంలో భజనలు, పూజలు చేసిన అనంతరం భక్తులు అన్నదానం చేశారు. అనంతరం నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగి గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే తోటి స్వాములు కారులో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, శివమాలధారులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా విషయం తెలుసుకున్న ప్రజలు, నాయకులు, మాలధారులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎపి కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్లు ముష్టూరు నరసింహారెడ్డి, గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు బోయ సాంబ, శాలివాహన సంఘం నాయకులు వక్కల శ్రీరాములు, తదితరులు ఉన్నారు.
రాజగోపాల్‌రెడ్డికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి










