ఇండోర్ : 21వ శతాబ్దంలోకి ప్రవేశించినా.. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులపై వివక్ష కొనసాగుతోంది. దళిత పెళ్లి బృందానికి గుడిలోకి ప్రవేశం లేదంటూ అగ్రవర్ణాలు హుకుం జారీ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. దళిత యువకుడు వికాస్ కల్మోడియా ఒక గుడిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి గుడికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడంతో పాటు కులం పేరుతో దూషించారని వికాస్ తండ్రి ఓంప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 9 మంది నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.










