- అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజీ
ప్రజాశక్తి-రాజోలు : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోరుబావి నుంచి మంటలు ఎగిసిపడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు ఎనిమిది గంటలు పాటు మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. రాజోలు మండలంలోని శివకోటిలోని ఓ రైతు ఆక్వా చెరువు కోసం తన పొలంలో శుక్రవారం బోరు బావిని తవ్వించారు. శనివారం ఉదయం అందులోనుంచి మంటలు, గ్యాస్ ఎగిసిపడటం ప్రారంభమయ్యాయి. ఒఎన్‌జిసి, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. గ్యాస్ పైప్‌లైన్ నుంచి వచ్చే మంటలయితే అదుపు చేయగలమని.. భూమి పొరల్లోని నిక్షేపాల నుంచి గ్యాస్ లీకైతే మాత్రం మంటలు ఆర్పివేయడం కష్టమవుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సుమారు ఎనిమిది గంటల పాటు మండిన గ్యాస్‌మంటలు దానంతట అవే అదుపులోకి రావడంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై స్థానికులు, అధికారుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతు పొలం నుంచే ఒఎన్‌జిసి పైపులైన్ వెళ్తుండటంతో.. బోరు బావి తవ్వే క్రమంలో గ్యాస్ పైపులైన్ లీకైందని స్థానికులు అంటున్నారు. 20 ఏళ్ల క్రితం గ్యాస్ నిక్షేపాలు వెలికితీసే క్రమంలో సీస్మిక్ సర్వేల్లో భాగంగా ఇదే ప్రాంతంలో బోరు వేశారని, ప్రస్తుతం అదే ప్రదేశంలో మరింత లోతుకు బోరు వేయటంతో గ్యాస్ బయటకు వచ్చి, మంటలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మంటలు గ్యాస్ పైపులైన్ నుంచి వెలువడుతున్నాయా? లేక భూమి పొరల నుంచే వస్తున్నాయా..! అన్న విషయం అంతు చిక్కడం లేదు.










