ప్రజాశక్తి - మడకశిర రూరల్ : గ్రామీణ క్రీడల అభివృద్ధికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని సి. కొడిగేపల్లిలో కాపు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ టీ -10 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. సి. కొడిగేపల్లి సర్పంచి కవిత అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ గ్రామీణ క్రీడల పట్ల యువతను మరింతగా ప్రోత్సహించడానికి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న కాపు సురేష్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ గ్రామీణ క్రీడల పట్ల యువతను మరింతగా ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తామన్నారు. టోర్నీ నిర్వాహకులు ఈసందర్భంగా ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. మొదటి రోజు జరిగిన మ్యాచ్లో పరిగి జట్టుపై మడకశిర మండలం చందకచెర్ల జట్టు గెలుపొందింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత సత్యనారాయణ, జెడ్పీటీసీ సరోజమ్మ, సింగల్ విండో అధ్యక్షులు రామిరెడ్డి, మాజీ ఎంపీపీ బజ్జప్ప, జమ్మానపల్లి మూర్తి, సర్పంచులు, ఎంపీటీసీలు, కన్వీనర్లు, మడకశిర, పెనుకొండ మండలాల నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.










