'కడుపుమంట దీర్పగా దినవలె దేహి/ మిక్కుటముగ తిండి మెక్కువాని/ పట్టి బందిలోన పడవేయవలె రాజు' అంటాడు పోతులూరి వీరబ్రహ్మం. ఆకలిమంట చల్లార్చడానికి మనిషి అవసరమైనంతే తినాలి. అతిగా తినేవాడిని పాలకుడు జైల్లో పడేయాలని దీని అర్థం. ఇప్పుడు అతిగా 'తినేటోళ్లు' పాలకుల పక్షాన వున్నారు. తినేకొద్దీ వీళ్ల పొట్ట సాగుతుంటుంది. వీళ్లది చల్లార్చలేని 'ఆకలి'. వీళ్లకి ఆ దేశం... ఈ దేశం అని తేడాలేదు. అన్ని రంగాల్లోనూ వీళ్ల హస్తం వుంటుంది. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల రూపకల్పనలోనే వీరి దోపిడీ నమూనా పూలచెండులో దారంలా దాగివుంటుంది. వీరే.. కార్పొరేట్లు. ప్రజల నమ్మకాలతో కూడా వ్యాపారం చేయగలరు. తమకు లాభాలు వస్తాయనుకుంటే, తమ లాభార్జనకు తోడ్పడుతుందనుకుంటే దేన్నీ వదిలిపెట్టరు. ప్రజల విశ్వాసాలను, నమ్మకాలను మూఢనమ్మకాలుగా మార్చేయగలరు. నష్టం వస్తుందని భావిస్తే... ఎలాంటి సాంకేతికతనైనా భ్రష్టు పట్టించేయనూగలరు. వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పావులు కదుపుతారు.
మూఢనమ్మకాలకు మూఢవిశ్వాసాలకు పెట్టింది పేరైన భారత్, శ్రీలంక వంటి దేశాల్లో... ఈ విశ్వాసాలు, నమ్మకాలను కూడా వ్యాపార సరుకుగా మార్చేశారు. ఈ క్రమంలో దేశాల ఆర్థికవ్యవస్థలను సైతం చిన్నాభిన్నం చేయగలరు. దానికి పెద్ద ఉదాహరణ శ్రీలంక సంక్షోభం. రసాయన ఎరువులకు బదులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వీరికి కొన్ని సంస్థలు, సూడో సైంటిస్టులు గొంతు కలిపారు. రసాయన ఎరువుల వాడకం వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేశారు. తాగే నీటిలో ఫ్లోరైడ్ అధిక శాతంలో ఉండడమే ఆ వ్యాధులకు కారణమని పరిశోధకులు చెప్పినా వాటిని కొట్టిపడేశారు. అంతేకాదు... రసాయన ఎరువులు నీటి ప్రవాహంలో కలవడంవల్ల, అవి ఆనకట్టలను కూడా కరిగించివేస్తాయన్న ప్రచారం సైతం చేశారు. ఆ ప్రచారం కార్పొరేట్లకు లాభాలు తెచ్చిపెడితే, ప్రజలను సంక్షోభంలోకి నెట్టేసింది. మన దేశంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలకు కొదవే లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే చదువురాదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం బాగోదని, మంచి మందులు వాడరని, మున్సిపాలిటీ నీళ్లు మంచివికావని, ఆ నీళ్లు తాగితే రోగాలొస్తాయని, రేషన్ బియ్యం తింటే అరగదని, కోటా బియ్యంలో పురుగులుంటాయని, అవి ఆరోగ్యానికి మంచిది కాదని పదేపదే వివిధ రూపాల్లో ప్రచారం చేసి ప్రజలు నమ్మేలా చేశారు. అంతేకాదు, ఫలానా పంట వేస్తే లాభాలు రావు, వ్యాపార పంటలే వెయ్యాలి. ఫలానా ఎరువులే వాడాలి. ఫలానా కంపెనీ విత్తనాలే విత్తాలి వంటివన్నీ ధారాళంగా ప్రచారంలో వున్నాయి. మున్సిపాలిటీ నీళ్లు తాగితే రోగాలొస్తాయని బెంగటిల్లి, మినరల్ వాటర్ తాగుతూ... లేని రోగాలను తెచ్చుకుంటున్నారు. ఈ మూఢనమ్మకం నీళ్ల వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులకు కూడా మూఢనమ్మకాలను ఆపాదించి ప్రజల్లో నైరాశ్యాన్ని నింపుతున్నారు.
ఇలాంటి గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను నమ్మిస్తారు. ఆ నమ్మకాన్ని లాభంగా మార్చుకుంటారు. 'మూఢనమ్మకం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. బలి కావడానికైనా.. బలి చేయడానికైనా సిద్ధపరుస్తుంది' అంటాడో రచయిత. ఇప్పుడు రేషన్ బియ్యం వంతు వచ్చింది. ఇది పేదల ఆకలి తీర్చడంలో ఎంతోకొంత ఉపయుక్తంగా వుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ విధానంలో మార్పులు చేయబోతున్నారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు బియ్యంకు బదులుగా నగదును ఇవ్వనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. బియ్యం రేషన్ షాపులో కొనుక్కుంటే కిలో రూపాయి. అక్కరలేదనుకుంటే కిలో బియ్యానికి రూ.12 నుంచి రూ.15 వరకు ఇస్తామని సర్కారు ఊదరగొడుతోంది. కాని, అదే బియ్యం మార్కెట్‌లో కొనాలంటే కనీసం రూ.40 ఖర్చు చేయాల్సి వుంటుంది. సర్కారు కసరత్తు చూస్తే... క్రమేణా బియ్యం కార్డులే లేకుండా చేయడం వైపు వారి అడుగులు సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం బాగోవన్న మూఢనమ్మకంతో కార్డులు వదులుకుంటే ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురికాకతప్పదు. 'మాకు గోడలు లేవు/ గోడలు పగలగొట్టడమే మా పని' అంటాడు శ్రీశ్రీ. ఈ మూఢనమ్మకాల గోడలను బద్దలు కొట్టేందుకు సరైన దిశగా ఆలోచించాలి... అడుగులు వెయ్యాలి.










