Aug 09,2020 09:26

కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకోవాలి. ఆ కలలు ఏ లక్ష్యం కోసం, ఎవరి సేవ కోసం అన్నది ముఖ్యం. దేశం కోసం, దేశ సేవ కోసం తపించి, తమ జీవితాలను దేశసేవలో పూనీతం చేసుకున్న వారెందరో వున్నారు. ఉన్నత చదువులు చదివిన సుభాస్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో అగ్రశ్రేణి అభ్యర్థిగా నిలిచాడు. అలా అందివచ్చిన సుఖప్రదమైన జీవితాన్ని తృణప్రాయంగా త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. దేశానికి తనను తాను అంకితమిచ్చుకున్నాడు. ఇలాంటివారిని ఉద్దేశించి... 'కొంతమంది యువకులు రా/ బోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలు' అంటాడు శ్రీశ్రీ. లక్ష్యాన్ని సాధించడంలో చెరసాలలు, ఉరికొయ్యలకు సైతం ఎదురు నిలుస్తారు. నవసమాజానికి బాటలు వేస్తారు. 'మాకు గోడలు లేవు/ గోడలను పగులగొట్టడమే మా పని' అంటూ ముందుకు సాగుతారు.
'కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు'...'తాతగారి నాన్నగారి/ భావాలకు దాసులు/ నేటి నిజం చూడలేని/ కీటక సన్యాసులు' అని కూడా మహాకవి శ్రీశ్రీ అంటాడు. ఇంట్లో అమ్మా నాన్న, స్కూల్లో టీచర్ల స్పూన్‌ ఫీడింగ్‌కి అలవాటుపడి, వాస్తవ ప్రపంచాన్ని గుర్తించలేని అంధులుగా బతుకుతుంటారు కొందరు. వీరికీ లక్ష్యాలుంటాయి. ఐఎఎస్‌లు, ఐఐటీలు చేసి... కార్పొరేట్‌ కంపెనీలకో, డాలర్లకో అమ్ముడు పోతారు. చందాకొచ్చర్‌ కావాలనో, సుందర్‌ పిచారులా అవ్వాలనో, జుకర్‌బర్గ్‌లా ఎదగాలనో కలలు కంటారు. ఐఎఎస్‌లు, ఐఐటీలే జీవిత లక్ష్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు... సరళీకరణ విధానాల వరవడిలో పడి కొట్టుకుపోతున్నారు. ఐఐటీల్లో ర్యాంకులు సాధించి, విదేశీ కంపెనీలకు ఊడిగం చేస్తూ, ఉంటుందో... ఊడుతుందో తెలియని ఉద్యోగంతో దినదిన గండంగా బతికేదొకడు. రేయింబవళ్లు చదివి, ఐఎఎస్‌ సాధించి, లక్ష్యాన్ని చేధించి... 'అయ్యా..ఎస్‌'లుగా మారిపోతున్న వాడు ఇంకొకడు. ప్రస్తుతం ఎంతమంది ఐఎఎస్‌లు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు? ఎందుకు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు? పాలకులకు ఎందుకు అంటకాగుతున్నారు? ఏ లక్ష్యం కోసం సివిల్స్‌ సాధించారు...ఎవరి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు? అనేది గుర్తించాలి. 'భవిష్యత్‌ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కొత్త విద్యా విధానం లక్ష్యం' అని ప్రధానమంత్రి చెబుతున్నారు. ఈ కొత్త విద్యావిధానం ఎవరికి మేలు చేసేదిగా వుంది. సామాన్యుడి లక్ష్యాలను, ఆశలను ప్రతిబింబిస్తున్నదా? అనే అనేక సంశయాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
నీ లక్ష్యాన్ని నిర్ణయించేది ఎవరు? నీ జీవిత గమనాన్ని శాసించేది ఎవరు? నీ లక్ష్యాలు, నువు నిర్దేశించుకున్న మార్గాలను బట్టే నీ గమ్యం ఆధారపడి వుంటుంది. మనిషి మరణించాక.. 'శవం' అనే అంటారు. చచ్చిన మరుక్షణం నుంచే పేరుతో పిలవడం మానేస్తారు. నీకోసం కాక, దేశం కోసం బతికిన వారు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా జీవిస్తారు. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ లాంటి మానవతావాదులు అనేకమంది ఐఎఎస్‌లుగా చెరగని ముద్ర వేశారు. దేశం కోసం, ప్రజల కోసం తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కాని అదంతా నయా ఉదారవాద శకానికి ముందు. ప్రభుత్వాలకు ప్రజాసంక్షేమం, అన్ని ప్రాంతాల, అన్ని తరగతుల అభివృద్ధి అనే ఎజెండాలు కూడా పరిమితంగానైనా వున్న కాలమిది. ఆ పరిమితుల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ప్రజలకుపయోగపడే విధంగా పనిచేయగలిగారు కొందరు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు. కాని గత మూడు దశాబ్దాలుగా ఒక శంకరన్‌ గాని, ఒక బిడి శర్మ గాని కనిపించడంలేదెందుకు? ఇప్పుడు ప్రభుత్వ ఎజెండా ఒక్కటే... కార్పొరేట్ల సేవలో తరించడం. అందులో ప్రజాసంక్షేమం నేతి బీరకాయ. అందుచేత ఇప్పుడు ఐఎఎస్‌లు ప్రజాసంక్షేమ దిశగా చర్యలు తీసుకునే అవకాశమే లేదు. కేవలం నయా ఉదారవాద విధానాలను అమలు జరిపే యంత్రాంగంలో భాగంగా మాత్రమే వారున్నారు.
జాతీయోద్యమ కాలంలో ఐసిఎస్‌ కన్నా దేశ ప్రయోజనమే మిన్న అని ఎంచుకున్న సుభాస్‌ చంద్రబోస్‌ వంటి నేతలు మన యువతరానికి మార్గదర్శకంగా నిలవాలే తప్ప, వ్యక్తిగతంగా కెరీర్‌ లోనో, సంపాదన లోనో పైకి ఎదిగిన వ్యక్తులు మార్గదర్శులు కారాదు. సమాజం ముందుకు పోవాలంటే సమాజహితమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నవారు ఆదర్శం కావాలే తప్ప వ్యక్తులుగా తాము బాగుపడితే చాలనుకునేవారు ఏనాటికీ ఆదర్శనీయులు కారు, కారాదు. 'అభిప్రాయాల కోసం/ బాధలు లక్ష్య పెట్టని వాళ్లు/ మా లోకి వస్తారు / అభిప్రాయాలు మార్చుకొని/ సుఖాలు కామించే వాళ్ళు/ మీలోకి పోతారు' అంటాడు శ్రీశ్రీ. అవును... ఇది కీలక సమయం. యువత తన గమ్యం ఎటువైపో నిర్ణయించుకునే తరుణం.