గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
ప్రజాశక్తి-అల్లూరు : నిరక్షరాస్యతలో అత్యధిక శాతం ఉన్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వైసిపి ఎస్‌టిసెల్ మండల అధ్యక్షులు దాసరి పోలయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని సింగపేట పంచాయతీ పరిధి మూర్తిరాజు సంఘం గిరిజన కాలనీ సందర్శించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచనలు మేరకు 5 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. అలా చేసుకోకపోతే తాను దగ్గరుండి ఈ సేవలు అందిస్తానని అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తెలియజేశారు. వికలాంగులు ఆయా కార్యాలయాలకు రాని పక్షంలో మొబైల్ వాహనం ద్వారా ఇంటి వద్దకే వచ్చి విస్తృత సేవలు అందిస్తామన్నారు. ఈ గ్రామం నుండి సుమారు 30 మంది విద్యార్థులు 1 కిలోమీటర్ల నడిచి ఆర్‌టిసిలో అల్లూరుకు చేరుకొని చదువుకొని తిరిగి వస్తున్నారని గిరిజనులు ఆయనకు వివరించారు. సంబంధిత విషయాన్ని వెంటనే ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్లి బస్ గ్రామంలోకి వచ్చే విధంగా చూస్తానని హామీనిచ్చారు. ప్రతి ఒక్కరినీ చదివించాలని అలాగే పిల్లలను ఇటుక బట్టీలు వద్ద ఉంచరాదని, అలాంటివారు ఎవరైనా ఉంటే సమాచారం ఇస్తే హాస్టల్లో ఉంచి చదివిస్తానని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అమలు చేస్తుందని ప్రతి ఒక్కరూ ఈ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరంజ్యోతి, రేవతి, పొట్లూరు చెంచయ్య, తదితరులు ఉన్నారు.










