- నీళ్లలోనే విలీన మండలాలు
- ప్రభుత్వ సాయం అంతంతే
- పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల లేమి
- చీకటిలోనే మగ్గుతున్న బాధితులు
ప్రజాశక్తి-విఆర్.పురం, చింతూరు, ఎటపాక, కూనవరం విలేకరులు : ఈసారీ విలీన మండలాల ప్రజలను గోదావరి నిలువునా ముంచేసింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం గతంలో మాదిరిగానే చేష్టలుడిగి చూస్తుండడంతో వరద బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లో ఎవరిని కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని సిఎం ఆదేశించినా చాలామందికి ఆదివారానికి అవి చేరలేదు. ప్రభుత్వం నుంచి అంతంత మాత్రంగానే సాయం అందుతోందని పలువురు వాపోతున్నారు.
ఆదివారం మధ్యాహ్ననికి గోదావరి, శబరి నదులు కాసింత శాంతించాయి. అయితే, గోదావరి ఎగపోటు, శబరి బ్యాక్ వాటర్ ప్రభావంతో చింతూరు మండల పరిధిలో సుమారు వంద గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ మండలంలో 11 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నారు. విఆర్.పురం మండలంలో దాదాపు అన్ని గ్రామాలూ వరద ప్రభావానికి గురయ్యాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గినా శబరి-గోదావరి సంగమం వద్ద మాత్రం పరిస్థితి భయంకరంగానే ఉంది. దీంతో, ఒడ్డుగూడెం, శ్రీరామగిరి ప్రాంతాల వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. భద్రాచలం వద్ద తగ్గి తమ ప్రాంతాల వద్ద వరద తగ్గకపోవడానికి కాఫర్ డ్యామే కారణమని వారు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వచ్చిన తరువాత ఏటా తాము ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇదే మండలంలోని ధర్మతాలగూడెం, గొల్లగూడెం గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. అక్కడ కనీస సౌకర్యాలు లేవని వారు తెలిపారు. నిత్యావసర సరుకులు ఇవ్వలేదని, తాగునీరూ కరువైందని, రాత్రివేళ విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఎటునుంచి విష పురుగులు వచ్చి కుడతాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని తెలిపారు. తాము పునరావాస కేంద్రానికి వచ్చి మూడు రోజులవుతోందని, తమ నివాసాలు మూడు రోజులుగా నీళ్లలోనే ఉండడంతో అవి ఉన్నాయో, కూలిపోయాయో కూడా తెలీదని వాపోయారు. సర్వం ఇళ్ల వద్ద వదిలేసి పునరావాస కేంద్రాలకు వస్తే ఇక్కడ ఏ అధికారీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటపాక, కూనవరంల్లోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది. వరద బాధితులు కష్టాలు అనుభవిస్తున్నారు.
- ప్రభుత్వానికి మేం పట్టమా?
ఈసారీ మమ్మల్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. వరద గురించి హెచ్చరించిన అధికారులు ఆ తరువాత మమ్మల్ని పట్టించుకోలేదు. సొంత ఖర్చులతోనే పునరావాస కేంద్రాలకు వచ్చాం. ఇక్కడ సదుపాయాలు లేవు. దీంతో, ఇక్కడే చిన్నపాటి పాకలు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నాం. తాగునీరు కూడా మాకు అందలేదు. కిరోసిన్, కొవ్వొత్తులు వంటి వాటిని కూడా ప్రభుత్వం అందించలేదు. రాత్రయితే చాలు భయమేస్తోంది.
- కోట్ల సురేష్, గొల్లగూడెం గ్రామం, విఆర్.పురం మండలం
- కందిపప్పు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
స్థానిక అధికారులు 27వ తేదీన వచ్చి హడావుడి చేసి మా ఇళ్లు ఖాళీ చేయించారు. ఫ్లడ్ సెంటర్లకు తరలి వెళ్లాలని, లేదంటే వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ తరువాత మమ్మల్ని పట్టించుకోలేదు. పది రోజులుగా వర్షం, వరద వల్ల చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. రూ.2 వేలు సొంత డబ్బులు వెచ్చించి ఒక్కో కుటుంబం ఆటోలు, వ్యాన్లును కిరాయికి మాట్లాడుకుని ఎర్రంపేటలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వచ్చాం. ఇక్కడ ఒక గదిలో ఆరు కుటుంబాల వారిమి ఉంటున్నాం. కేజీ కందిపప్పు మాత్రమే ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. బియ్యం, మంచి నూనె, ఉప్పు, కారం వంటివి ఇవ్వలేదు. ఎలా బతకాలి. తక్షణం నిత్యావసర సరుకులు అందించాలి.
- చింతూరు శబరిఒడ్డు వాసులు










