- చంద్రబాబు, టిడిపి అంతానికి జగన్ కుట్ర
ప్రజాశక్తి-రాయదుర్గం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర పన్నినట్లు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం ఒక నియంతపై పోరాటానికి మేము సైతం పేరిట టిడిపి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని శ్రీనివాసులు శుక్రవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రారంభించారు. ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు జైలు నుండి విడుదల అయ్యేంతవరకు తాను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నట్లు శిబిరంలో ప్రకటించారు. జాతీయ స్థాయిలో అనేక ముఖ్య సంఘటనలకు కారణమైన ఒక గొప్ప దృక్పథం, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తమ నాయకుని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా నైపుణ్యాభివృద్ధి సంస్థలో అవినీతి పేరిట అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిందన్నారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణలో ఎలాంటి అవినీతి జరగలేదని ఈ శిక్షణ వల్ల అనేకమంది శిక్షణ పొంది ఉపాధి పొందారన్నారు. 14 రోజులుగా జైలులో ఉన్న తమ నాయకునికి ఏమాత్రం కనీస సౌకర్యాలు కూడా జైలులో కల్పించలేదన్నారు. వేలకోట్ల అవినీతి కేసులో కూరుకుపోయిన, రాష్ట్రంలో అరాచక పాలన అధికారాన్ని సాగిస్తున్న జగన్ అనవసరంగా ఇతర కేసులలో కూడా తమ నాయకుని ఇరికించి జైల్లోనే పెట్టి ఏకపక్షంగా ఎన్నికలలో తిరిగి అధికారం కైవసం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. దీంతో తమ పార్టీ నాయకులు కార్యకర్తలు మా అభిమానులు భయభ్రాంతులకు గురిఐ సులభంగా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని దుర్మార్గపు ఆలోచనలు జగన్ ఉన్నట్లు వ్యాఖ్యానించారు. జగన్ తప్పుడు చర్యలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురికారాదని కోరారు. ఇలాంటి తరుణంలో తమ నాయకుడు నిర్దోషిగా వెలుపలికి వచ్చేందుకు అందరూ సంఘటితమై పోరాటం చేయాలని కోరారు. చంద్రబాబు జైలు నుండి విడుదల అయ్యే వరకు తాను ఆహారం తీసుకోని నిరాహారదీక్ష చేస్తారని శ్రీనివాసులు ప్రకటించారు. నిరాహార దీక్ష శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ యొక్క వీలును బట్టి రిలే లేదా నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగరాజు, పురుషోత్తం, జ్యోతి, భారతి, మహబూబ్ బాషా, వెంకటేశులు, ప్రశాంతి, గిరి మల్లప్ప, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు నాగార్జున, బి.ఎస్.పి రాయదుర్గం తాలూకా అధ్యక్షులు ఉలుగప్ప, అనేక మంది టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్నారు.










