ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అమలవుతోందో లేక అందుకు విరుద్ధంగా జరుగుతోందో విచారించి తేల్చేందుకు పూనుకున్న రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలను నిలుపుదల చేస్తూ శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర స్టే సరైన సమయంలో సరైన నిర్ణయం. రాజ్యాంగం పరిధిలో ఏర్పాటైన హైకోర్టు అదే రాజ్యాంగం నిర్దేశించిన పరిధిని దాటి వేరే వ్యవస్థలో జోక్యం చేసుకొనే యత్నానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడం ద్వారా న్యాయస్థానాల పరిమితులను గుర్తు చేసింది. కొంత మంది వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన ఉదంతాలపై వారి కుటుంబీకులు హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేసిన సందర్భంలో అక్టోబర్ 1న హైకోర్టు స్పందిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై విచారిస్తామని తనకు తానుగా (సూమోటో) ఉత్తర్వులిచ్చింది. ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ద్వారా కోరగా కోర్టు తిరస్కరించింది. దాంతో సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వులను నిలిపేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు రాజ్యాంగ ఉల్లంఘన, అనుబంధ పిటిషన్లపై తదుపరి విచారణ ఆపాలని హైకోర్టును ఆదేశించింది. 'సుప్రీం' విచారణ సమయంలో తలెత్తిన ప్రశ్నలను, సందేహాలను గమనిస్తే హైకోర్టు తన పరిధిలో లేని, తనకు ఎంత మాత్రం అధికారం లేని 'రాజ్యాంగ ఉల్లంఘన' అంశంలోకి జొరబడటానికి అత్యుత్సాహ పడిందని అర్ధమవుతుంది.
రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగ ఉల్లంఘన గురించి రాజ్యాంగం 356వ అధికరణలో స్పష్టీకరించింది. దాని ప్రకారం రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘనపై పరిశీలించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే దఖలు పడింది. గవర్నర్ ద్వారా నివేదిక అందినప్పుడుకానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడవట్లేదని రాష్ట్రపతి విశ్వసించినప్పుడు మాత్రమే 356 ఆర్టికల్‌ను అనుసరించి రాష్ట్రపతి పాలన విధించే వీలుంది. పూర్తిగా రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలను హైకోర్టు తన చేతుల్లోకి తీసుకొని చెలాయిస్తామనడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే విషయంపై గతంలో ఎస్.ఆర్ బొమ్మయి కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ఎ.పి హైకోర్టు గమనంలో లేకపోవడం విచారకరం.
రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ చర్యలకు అడ్డుకట్ట వేసి రాజ్యాంగాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి హైకోర్టు పని చేయాలి. ఆ విధంగాకాక హైకోర్టే తన పరిధిని అతిక్రమిస్తే అది ప్రజాస్వామ్యాన్ని బలపరచకపోగా తద్విరుద్ధమైన ఫలితాలనిస్తుంది. గత కొంత కాలంగా కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. ఈ పర్యవసానాలు ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులపై ప్రతివాదులు, వారికి మద్దతిచ్చేవారు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా జడ్జిలను దూషిస్తూ పోస్టింగ్‌లు పెట్టడం వివాదాస్పదమైంది. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే వరకు వెళ్లింది. మరో వైపు కొంత మంది హైకోర్టు జడ్జిలపైనా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిపైనా ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి 'సుప్రీం' ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనమైంది. శాసన, పాలన, న్యాయ వ్యవస్థలు వేటికవి రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయి. రాజ్యాంగబద్ధంగా అవి పని చేయాలి. ప్రతి వ్యవస్థకూ వాటి వాటి అధికారాలు, హక్కులు, విధులు నిర్వచించబడ్డాయి. వ్యవస్థలు తమకు నిర్దేశించిన పరిధులను గౌరవిస్తూ, వాటికి లోబడి పని చేయడం వాటి కర్తవ్యం. రాజధాని, స్థానిక ఎన్నికల వంటి పలు ప్రధాన కేసులు న్యాయ సమీక్షలో ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మార్పు చర్చనీయాంశమైంది. అటు న్యాయ వ్యవస్థ ఇటు ప్రభుత్వం రెండూ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పని చేసినప్పుడే వాటి విశ్వసనీయత పెరుగుతుంది.










