Sep 13,2020 07:36


విద్యుత్‌ చట్టం (2003)ను సవరించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని గత మూడేళ్లుగా చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 9న హఠాత్తుగా పాత చట్టం కింద కొత్తగా రూల్స్‌తో ముసాయిదాను రాష్ట్రాలకు పంపడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. జూలై 3న రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులతో జరిపిన సమావేశంలో కూడా కేంద్ర మంత్రి చట్ట సవరణల గురించే వివరించారు. ఇంతలోనే కొత్త రూల్స్‌ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ (వినియోగదారుల హక్కులు) నిబంధనలు-2020 పేరిట పంపిన ఈ ముసాయిదాలో హక్కుల సంగతి ఎలా ఉన్నప్పటికీ సంస్కరణల జోరు మాత్రం ఎక్కువగా వుంది. స్మార్ట్‌ మీటర్లు, అందునా ప్రీ పెయిడ్‌ మీటర్ల ఏర్పాటు, సౌర విద్యుత్‌కు సంబంధించిన కొన్ని నియమాలు వీటిలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. భారత్‌లో సౌర విద్యుత్‌ పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తున్న విదేశీ కార్పొరేట్లకు భరోసా కల్పించడమూ ఒక అంశంగా వుంది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటంటే వేల కోట్ల రూపాయల వ్యాపారం, తద్వారా దేశవిదేశీ బేహార్లకు చేతినిండా 'పని', అధికారంలో వున్నవారికి ముడుపులూ...ఇలా ఈ రూల్స్‌తో పాలకులకు బహుళ ప్రయోజనాలున్నాయి మరి!
స్మార్ట్‌ మీటర్ల కథా కమామిషు...
కేంద్రం తెచ్చిన నిబంధనల ప్రకారం ఇకనుండి అన్ని కొత్త కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లేనే అమరుస్తారు. కొత్త మీటర్లైనా, పాత మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి వచ్చినా, స్మార్ట్‌ మీటర్లే బిగించాలని పేర్కొన్నారు. ఆ తరువాత పాత మీటర్ల స్థానంలో కూడా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారులందరీకి అని నిబంధనల్లో పేర్కొనడంతో గృహ విద్యుత్‌తో పాటు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లే. వినియోగదారులు నెల రోజులపాటు విద్యుత్‌ వాడుకున్న తరువాత బిల్లు చెల్లిస్తున్న విధానం ఇప్పుడు అమలులో వుంది. భవిష్యత్తులో ఈ విధానం వుండదు. మొబైల్‌ ఫోన్ల మాదిరి ప్రీ పెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం వినియోగదారు ఆ నెలలో తాను ఎంత విద్యుత్‌ వాడుకుంటారో ముందుగానే అంచనా వేసుకుని ఆ మేరకు సొమ్ము చెల్లించి, మీటర్‌ను ఛార్జి చేసుకోవాలి. ఆ మొత్తం అయిపోతుండగానే మళ్లీ రీఛార్జి చేసుకోవాలి. అలా చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది.
ఇప్పుడు మన ఇళ్ల వద్ద వున్న విద్యుత్‌ మీటర్లను ఎనలాగ్‌ మీటర్లంటారు. అంటే విద్యుత్‌ వినియోగాన్ని అంకెల్లో రీడింగ్‌ చూపిస్తుంది. అది వినియోగదారుకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో ఒక ఉద్యోగి ఇంటివద్దకు వచ్చి రీడింగ్‌ రికార్డు చేస్తే దాన్ని బట్టి బిల్లు వసూలు చేస్తున్నారు. కాని, స్మార్ట్‌ మీటరు విద్యుత్‌ వినియోగాన్ని ఎప్పటికప్పుడు డిస్కాముకు సమాచారమిస్తుంది. చిప్‌ ఆధారంగా పని చేస్తుంది కనుక వినియోగదారు కూడా ఇంటర్నెట్‌ ద్వారా సమాచారం పొందవచ్చు. అంతే తప్ప ఇప్పటి మాదిరిగా రీడింగ్‌ చూసుకునే వీలుండదు. వినియోగదారులు ఎందరు ఇంటర్నెట్‌ వాడుతారు? పైపెచ్చు స్మార్ట్‌ మీటర్‌ ను విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుండి నియంత్రిస్తారు. రానున్న రోజుల్లో గడువు లోగా డబ్బు చెల్లించకపోతే అక్కడే కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేసేస్తారు. సాధారణ మీటర్ల స్థానంలో 'చైనా మీటర్లు' వచ్చినపుడు ఎంత తేడా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇకపై స్మార్ట్‌తో అంతకు మించిన తేడాలు, వినియోగదారులపై భారాలు పెరగవచ్చు.
కొండ నాలుకకు మందేస్తే....
స్మార్ట్‌ మీటర్లయితే ఏ సమయంలో ఎంత విద్యుత్‌ను ఏ వోల్టేజితో, ఎంత ఫ్రీక్వెన్సీలో వాడుతున్నారువంటి సూక్ష్మ వివరాలు కూడా పొందవచ్చుననీ, బిల్లు పక్కాగా వుంటుందనీ ప్రభుత్వ పెద్దలు గట్టిగా చెబుతున్నారు. కాని, ఆచరణ అంత గొప్పగా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌ లోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల స్మార్ట్‌ మీటర్లు బిగించింది. మరో 30 లక్షలు బిగించాల్సి వుంది. కాగా, పోయిన కృష్ణాష్టమి (ఆగస్టు 12) నాడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టుండి కరెంటు ఆగిపోయింది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఆరేడు గంటల్లో పునరుద్ధరణ జరిగినా చాలా చోట్ల రెండు మూడు రోజుల పాటు కరెంటు రాలేదు. ప్రజలు గగ్గోలు పెట్టడంతో అటు ప్రభుత్వము ఇటు రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (యుపిఇఆర్‌సి) విచారణకు ఆదేశించాయి. విద్యుత్‌ ఇంజనీర్లు, పోలీసులు దర్యాప్తు చేసి స్మార్ట్‌ మీటర్లను ఎవరో హ్యాక్‌ చేసినందున ఈ ఘోరం జరిగిందని తేల్చారు. దీనిపై యుపిఇఆర్‌సి చేపట్టిన విచారణలో స్మార్ట్‌ మీటర్ల ద్వారా నేరాలు జరిగితే ఏ శిక్షలు విధించవచ్చునో తెలిపే చట్టం ఏదీ యు.పి లో లేదని డిస్కామ్‌లు వింత వాదన చేశాయి. దాన్ని తిరస్కరించిన యుపిఇఆర్‌సి కరెంటు పోయిన ప్రతి కనెక్షన్‌ యజమానికి వంద రూపాయలు చెల్లించాలని డిస్కాములను ఆదేశించింది. ఒక రోజుకన్నా ఎక్కువగా కరెంటు పోతే వారికి రోజుకు వంద రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ జరిమానాను రానున్న నెలల కరెంటు బిల్లులకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.
స్మార్ట్‌ మీటర్లు పెట్టినంత మాత్రానే డిస్కాముల ఆదాయాలు అమాంతం పెరిగిపోవనీ ఉత్తరప్రదేశ్‌ అనుభవమే చెబుతోంది. ఆ రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే స్మార్ట్‌ మీటర్ల తంతు మొదలయింది. ఆ విధానాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజేయడానికి డిస్కాములు యుపిఇఆర్‌సి కి అందజేసిన నివేదికలో వివరంగా పేర్కొన్నాయి. ఆ రాష్ట్రం లోని ఐదు డిస్కాముల పరిధి లోని 40 లక్షల మంది వినియోగదారులకు 3.01 లక్షల మిలియన్‌ యూనిట్ల కరెంటు సరఫరా చేస్తుండగా బిల్లింగ్‌ 77 శాతం మేరకే 2017-18లో జరిగిందని వివరించాయి. అన్ని కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే బిల్లింగ్‌ 83 శాతానికి పెరుగుతుందని అంచనా వేశాయి. అంటే అప్పటికీ 17 శాతం మిస్సింగే! దానికి తోడు స్మార్ట్‌ మీటర్లకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి వుందని నిర్ధారణయింది. అయితే డిస్కాములకు ఆదాయం పెరగడం, వినియోగదారులు వాడిన కరెంటుకు బిల్లు తప్పనిసరిగా, ముందుగానే చెల్లించడంతో వాటికి నిస్సందేహంగా లబ్ధి చేకూరుతుంది. అంతేగాక వెయ్యి రూపాయలకు పైబడిన బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించడం వంటి షరతులతో డిస్కాములకు చెల్లింపులు ఖరారవుతాయి. ఇదంతా డిస్కాములను ఆర్థికంగా పరిపుష్టం చేసి, ఆ తరువాత ప్రైవేటుకు అప్పగించడానికి మార్గం సుగమం చేయడానికే!
సోలార్‌ హడావుడి
కొత్తగా తెచ్చిన రూల్స్‌ లోని 15 పేజీల్లో నిర్వచనాలు, ఇతర అంశాలు పోను మీటర్లకు సంబంధించినవి మూడు పేజీలు కాగా సౌర విద్యుత్‌పై రెండు పేజీలున్నాయి. దీన్నిబట్టే ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటో విదితమవుతోంది. ఇప్పటివరకు సౌర విద్యుత్‌ ప్యానళ్లను ఆయా వినియోగదారుల ఇళ్ల పైన, లేదా పొలంలో ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేయడం పరిపాటి. అలాగే వారు సొంతంగా ఉత్పత్తి, వినియోగం చేస్తారు. కొత్త రూల్స్‌లో తమ ఆవరణకు బయటి నుండి కూడా ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఏ సర్వీసు ప్రొవైడర్‌ (ప్రైవేటు ఉత్పత్తిదారు) నుండి కూడా తీసుకోవచ్చునన్నారు. ఇదంతా ప్రైవేటు సౌర విద్యుదుత్పత్తిదార్లకు భరోసా కల్పించడానికి కాక మరేమిటి? ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడే వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పిపిఎ లను సమీక్షిస్తామని గంభీరంగా ప్రకటించగా ఆ వెంటనే కేంద్ర మంత్రి లేఖ సంధించిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. సౌర, పవన విద్యుత్‌ రంగంలో వస్తున్న విదేశీ పెట్టుబడికి అపనమ్మకం కలుగుతుందని ఆ లేఖలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తన వేగాన్ని తగ్గించింది. ఇప్పుడు రూల్స్‌లో ఇంకో రూపంలో కార్పొరేట్లకు కేంద్రం భరోసా కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూల్స్‌ వినియోగదారులకు కొత్తగా హక్కులు కల్పించేది లేదు సరికదా ప్రైవేటుకు రక్షణ కల్పించడానికే! కాబట్టి ఈ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. వారందుకు సిద్ధపడరు కనుక విద్యుత్‌ నిపుణులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలి.