Jul 25,2023 09:31

జెరూసలెం : భారీ నిరసనల మధ్య వివాదాస్పద న్యాయ సంస్కరణల బిల్లును నెతన్యాహు ప్రభుత్వం సోమవారం ఇజ్రాయిల్‌ పార్లమెంటు (నెసెట్‌) లో ఆమోదింపజేసుకుంది. ప్రతిపక్షాలు ఓటింగ్‌ను బహిష్కరించిన నేపథ్యంలో 64-0 తేడాతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్‌ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు లేకుండా చేసేందుకు నెతన్యాహు ఈ బిల్లును తీసుకొచ్చారు.బిల్లుపై తుది ఓటింగ్‌ను బహిష్కరించిన ప్రతిపక్షాలు సభాపతి చాంబర్‌లోకి దూసుకెళ్లి సిగ్గు ..సిగ్గు అంటూ నినదించారు. బిల్లుపై రాజీకి నెతన్యాహు ససేమిరా అంటూ ఓటింగ్‌కు పెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఇజ్రాయిల్‌ అంతటా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. సోమ వారం కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు. 56 ఏళ్లుగా వెస్ట్‌బ్యాంక్‌ ను ఇజ్రాయిల్‌ అన్యాయంగా ఆక్రమించుకుని, అక్కడ యూదులకు పెద్దయెత్తున నివాసాలను నిర్మిస్తోంది. పాలస్తీనీయులను సొంత గడ్డపై శరణార్థులుగా మార్చుతోంది. ఇప్పుడీ బిల్లు ఆమోదం పొందడంతో యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇక అడ్డు అదుపు ఉండదని ప్రజాతంత్రవాదులు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.