Aug 18,2020 07:49

ఉట్టికెగరలేనోడు ఆకాశానికెగురుతానన్నట్టుంది ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం. ఏకకాలంలో ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభం కలగలసి ప్రజల బతుకులను ఛిద్రం చేస్తుండగా, ఆ సమస్యలను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన బిజెపి ప్రభుత్వం, తప్పించుకునేందుకు చారిత్రాత్మక ఎర్రకోట సాక్షిగా కాకమ్మ కబుర్లు చెప్పింది. పచ్చి అబద్ధాలను వండి వార్చింది. మరోవైపు 'సంస్కరణ'ల పేరుతో ప్రపంచ పెట్టుబడికి, కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టు పెట్టే మరిన్ని చర్యలను ఏకరువు పెట్టింది. ఆర్థిక మాంద్యం, కరోనా కష్టాలను విజయవంతంగా ప్రభుత్వం ఎదుర్కొందని, ప్రపంచం మన వంక చూస్తోందని పిట్టలదొర మాదిరి ఆకాశానికి నిచ్చెనెలేసింది. కానీ వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆర్‌బిఐ, ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, సహా పలు సంస్థలు, రేటింగ్‌ సంస్థలు కోడై కూస్తున్నాయి. భారత్‌ వృద్ధి రేటు మైనస్‌ లోకి దిగజారిందని నొక్కి వక్కాణిస్తున్నాయి. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఆదేశిత విధానాలు అమలు చేసే ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ పతనంపై అవి చేస్తున్న నిర్దేశాలను విస్మరించడం వంచనే. మోడీ ప్రభుత్వం వచ్చీరాగానే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని, ఆ లక్ష్యాన్ని 'మేక్‌ ఇన్‌ ఇండియా' సుసాధ్యం కావిస్తుందని దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారు. అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. చివరికి పకోడీలు అమ్ముకోవడమూ ఉద్యోగమేనని చదువుకున్న నిరుద్యోగులను అవమానపర్చారు. మేక్‌ ఇన్‌ ఇండియా వైఫల్యం కళ్ల ముందుండగా కొత్తగా మేక్‌ ఫర్‌ వరల్డ్‌ నినాదాన్ని మంత్రంగా జపిస్తూ ముందుకెళ్లాలంటూ పాత, విఫల నినాదానికే కొత్త పేరు పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్లకు అమ్ముతూ, నిర్వీర్యం చేస్తూ మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అనడం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకే.
కరోనా నేపథ్యంలో పలు రంగాలను ఆదుకునేందుకు కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాథమిక లక్ష్యం రైతులు, వ్యవసాయ రంగాల చేయూతకేనన్నారు ప్రధానమంత్రి. కేంద్రంలో బిజెపి వచ్చాక ఈ ఆరేళ్లూ రైతులను, సేద్యపు రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణ సమస్యలను వ్యవసాయరంగం బాగా ఎదుర్కొంటోంది. రైతులకు సహాయపడాల్సింది పోయి, రైతులు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు స్వాతంత్య్రం కల్పించామంటున్నారు మోడీ. నిజానికి స్వాతంత్య్రం ఇచ్చింది రైతులకు కాదు, కార్పొరేట్లకు. ఆత్మనిర్భర్‌ వలన రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఎఫ్‌డిఐల్లో వృద్ధిరేటు 18 శాతం సాధించి, ప్రపంచం దృష్టి ఆకర్షించామంటున్నారంటే, దానర్ధం వాల్‌మార్ట్‌, మోన్‌శాంటో వంటి కార్పొరేట్లకు మరింత దోచిపెడతామని ఆఫర్‌ ఇస్తున్నారన్నమాట. కార్మిక హక్కులపై దాడులు, సంస్కరణలు, డిజిటల్‌ స్కీంలు కార్పొరేట్ల దోపిడీకి సహకరించేందుకే.
భారత స్వాతంత్య్ర పోరాటం స్వావలంబన ఆకాంక్ష నుంచి పుట్టింది. సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేసి వెనక్కి కొట్టింది. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లవుతున్న వేళ బిజెపి ప్రభుత్వం భుజానికెత్తుకొన్న నయా-ఉదారవాద విధానాలు దేశ స్వయం సమృద్ధి, స్వావలంబనలను ప్రశ్నార్ధకం చేశాయి. నయా-ఉదారవాద విధానాలను ముందటికంటే దూకుడుగా అమలు చేస్తామని ఎర్రకోట బురుజు పైనుంచి ప్రధాని కుండబద్దలు కొట్టారు. మరోవైపు తన హిందుత్వ సిద్ధాంతానికి సానపెట్టి కార్యాచరణలో పెట్టేందుకు వ్యవస్థల ధ్వంసానికి జైకొట్టారు. మన రాజ్యాంగానికి ఆత్మగా ఉన్న ప్రజాస్వామ్యం పైనా, లౌకికత్వం పైనా, సామ్యవాద విలువల పైనా బిజెపి ప్రభుత్వం సాగించిన తీవ్రాతి తీవ్ర దాడులకు మద్దతు పలికారు. ఉదారవాద విధానాల వైఫల్యాలను ఏకరూప సిద్ధాంత ప్రచారంతో మరుగున పర్చేందుకు యత్నించారు. బిజెపి ప్రభుత్వ దాడులతో ప్రమాదపుటంచుకు చేరిన రాజ్యాంగ, దేశ సమగ్రత, సౌభ్రాతృత్వాల పరిరక్షణకు ప్రజలు నాటి స్వాతంత్య్ర పోరాట పటిమను కనబర్చాల్సిన సమయమిదే.