Mar 24,2023 21:04

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో రీసర్వే పూర్తి చేసిన గ్రామాలు, మండలాలలో ఏప్రిల్‌ 30లోపు హద్దురాళ్లను తప్పనిసరిగా పాతించాలని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌, తహశీల్దార్‌ను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో వివిధ అంశాలపై తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలు, మండలాలలో వెంటనే హద్దురాళ్లను పాతించే కార్యక్రమం మొదలు పెట్టాలని, కనీసం రోజుకు 50 రాళ్లను పాతే విధంగా కషి చేయాలని సూచించారు. ఆర్‌డిఒలు కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాలన్నారు. మండలంలో డ్రోన్‌ ఫ్లై ఎక్కడెక్కడ జరుగుతోంది, గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్లను సరిగా చెక్‌ చేయాలని చెప్పారు. 22ఎ, ఖాతా సంఖ్యలను పక్కాగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. 22ఎ లేయర్‌ పూర్తి చేయడానికి ముందే క్లరికల్‌ తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పారు. రీ సర్వేకు సంబంధించి తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో తరచూ పర్యటనలు నిర్వహించాలని, సర్వే పనుల పూర్తికి మండల సర్వేయర్లను వినియోగించుకోవాలన్నారు. ఎక్కడైనా మండల సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయకపోతే చర్యలు తీసుకొని తనకు నివేదిక పంపించాలని తెలిపారు. మండలాలలో ఇప్పటికే గుర్తించిన అసైన్‌మెంట్‌ భూములకు అర్హులను గుర్తించాలన్నారు. మండలంలో అసైన్‌మెంట్‌ కమిటీతో ప్రతివారమూ సమావేశాలు నిర్వహించాలని, ఇంకను అవసరమైన చోట్ల శ్మశాన వాటికలకు భూములు గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ఓటర్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు 6(బి) ఫారంలో సంతకాలు పొందాలని సూచించారు. ఈ ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేసేలా కృషి చేయాలని తెలిపారు. ఇందుకు ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కోర్టులలో పెండింగ్‌ ఉన్న కేసులకు ఎప్పటికప్పుడూ కౌంటర్‌ అఫడవిట్లు దాఖలు చేయాలని, కంటెంప్ట్‌ వరకు తీసుకు రావద్దని ఆదేశించారు. ఈ విషయంలో ఆయా రెవెన్యూ డివిజనల్‌ అధికారులు తగు పర్యవేక్షణ చేయాలని కోరారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించి తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయ, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, మదనపల్లి ఆర్‌డిఒ మురళి, కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, తహశీల్దార్లు పాల్గొన్నారు.