ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం లోని పాలక బిజెపి ఆడుతున్న రకరకాల రాజకీయ క్రీడలు పూర్తిగా బహిర్గతమైనాయి. చంద్రబాబు హయాంలో ప్రత్యేక హోదా నిరాకరణ, విభజన హామీల హుళక్కితో మొదలైన ఈ క్రీడ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత మాయాజాలంగా మారింది. రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన కేంద్రం హైకోర్టులో మూడోసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో మరో అడుగేసింది. మూడు రాజధానులు వుండకూడదని ఎక్కడా లేదని పేర్కొంది. ఎ.పి పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 13లో 'ఎ క్యాపిటల్' అని వుంది గనక ఒకే రాజధాని వుండాలనే వాదనను తోసిపుచ్చింది. ఒకే రాజధాని అన్నా అది అమరావతి మాత్రమేనని చెప్పడానికి లేదన్నది. కేంద్రం ఎ.పి రాజధానికి నిధులు ఇవ్వడం, రిజర్వు అడవులను అప్పగించడం వంటి పనులు మాత్రమే చేసింది తప్ప అమరావతి నిర్ణయం తమది కాదని కూడా తెలిపింది. హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వడం బట్టి మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పడం చెల్లదని హోం శాఖ పేర్కొంది. రాజధాని లోనే హైకోర్టు ఉండాలని ఎక్కడా లేదు. మార్చకూడదనీ లేదు. మొత్తంపైన జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు తమ అభ్యంతరం లేకపోగా ఆశీస్సులు కూడా వున్నాయని కేంద్రం చెప్పడం కొందరు ఇప్పటి వరకూ చేస్తున్న ప్రచారాలకు భిన్నంగా వుంది. దీని తర్వాత ఇక ఉన్నత న్యాయస్థానం విచారణే అంతిమం కానుంది. ఆ తీర్పు వచ్చాక సుప్రీం కోర్టుకు వెళ్లడం జరుగుతుంది. కనక కేంద్రం ఏం చెప్పినా రాజధాని వ్యవహారం దీర్ఘకాలం కొనసాగవచ్చు. మూడు సార్లు కేంద్రం సానుకూలంగా స్పందించిన ప్రభావం కోర్టుల నిర్ణయంపైనా వుండొచ్చు. గతంలో సిఆర్‌డిఎ కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం, రైతులకు న్యాయం చేయడం వంటి అంశాలపై కోర్టులు కేంద్రీకరించవచ్చు. సోము వీర్రాజు అద్యక్షుడైన వెంటనే రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం, హోం శాఖ మూడో అఫిడవిట్ బిజెపి మార్కు రాజకీయ క్రీడకు అద్దం పడుతున్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు 248 అధికరణం కింద కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పడం చెల్లుబాటయ్యేది కాదు గాని కేంద్ర బిజెపి, ప్రధాని మోడీ రాజకీయంగా జోక్యం చేసుకుంటే ఈ సమస్య చిటికెలో పరిష్కారమయ్యేది. కాని మోడీ ఆశీస్సులతోనే జగన్ తన వ్యూహం సాగిస్తున్నారని ఇంకెవరూ చెప్పనవసరం లేకుండా పోయింది.
విద్యుత్, పట్టణ భారాలకై కేంద్రం ఒత్తిడి
ఇక పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్న జగన్ నిర్ణయం వెనక కేంద్ర షరతులు వున్నాయి. ఎన్టీఆర్ శ్లాబ్ రేటు ఫలితంగా 1984లో అదృశ్యమైన విద్యుత్ మీటర్లు జీవో నెం 22 ద్వారా మళ్లీ ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్‌గా తయారైన ఈ మీటర్లతో ఓవర్ స్మార్ట్‌గా ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టడానికి రంగం సిద్ధమైంది. అసలు ఉద్దేశమే వడపోత. రైతుపై ఒక్క రూపాయి కూడా భారం మోపబోమని ముప్పై ఏళ్లు ఉచితాన్ని కొనసాగించే సత్తా వుందని ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చే హామీలు నిలిచేవి కావు. కేంద్రం షరతులలో వారి పాత్ర నామమాత్రం. రాష్ట్రాలు ద్రవ్యలోటు పరిమితికి మించి అప్పులు తెచ్చుకోవడాన్ని అనుమతించాలంటే ఒకే రేషన్, పట్టణ పాలక సంస్థల స్వయం సమృద్ధి, స్మార్ట్ మీటర్లు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం అనే నాలుగు షరతులు పెట్టడం ప్రజలపై భారం పెంచడానికి ప్రైవేటు కార్పొరేట్ల ప్రయోజనాలకూ మాత్రమే. రాష్ట్రం నడక కూడా ఆ వైపే వుంది. అందరికన్నా ముందే మొదలు పెట్టింది కూడా. కేంద్రం కొత్త విద్యుత్ సంస్కరణలలో రాష్ట్రం రెండు రూపాయల లోపుగానే సబ్సిడీ ఇవ్వడం అనుమతించబడుతుంది. ఉచితం అసలు ఒప్పుకోవడం వుండదు. ప్రభుత్వం వారికి నగదు బదలాయించి మళ్లీ కట్టించుకోవడం కోసమని స్మార్ట్ మీటర్లని చెబుతున్నారు. గతానుభవాల నేపథ్యంలో చూస్తే హామీలు ఎన్ని వున్నా సాధించుకున్న రాయితీలు కోత పడటం, ప్రయోజనాలు మాయం కావడం ప్రజలకు తెలుసు. జగన్ అధికారం చేపట్టగానే పిపిఎ ల సమీక్ష అంటూ విద్యుత్ వ్యయం తగ్గిస్తానన్నారు. సౌర, పవన విద్యుత్‌లను చంద్రబాబు ప్రభుత్వం అవసరాన్ని మించి కొన్నట్టు ఆరోపించారు. ఇప్పుడు తామే దాన్ని విస్తరిస్తాం అంటున్నారు. ఇప్పటి వరకూ ఉచిత విద్యుత్‌కు రూ. నాలుగు వేల కోట్లు సబ్సిడీ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని రూ.ఎనిమిది వేల కోట్లకు పెంచి చూపిస్తున్నారు. పిపిఎ ల సమీక్షతో ధర తగ్గి వుంటే ఈ విధంగా రెట్టింపు వ్యయం ఎందుకు చూపిస్తున్నట్టు? రేపు రేట్లు పెంచడానికే. కేంద్రం చెప్పిన ప్రకారం అప్పు తెచ్చుకోగలిగిన మొత్తం రూ.1500 కోట్లు దాటదు. కాని స్మార్ట్ మీటర్లు బిగించడానికే రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. దీన్ని అమలు చేయడానికి పర్యవేక్షించడానికి వివిధ స్థాయిల్లో కమిటీలు...ఉచిత వ్యవసాయ విద్యుత్‌లో అనేక దొంతరలు, మెలికలు ఏర్పడుతున్నాయి. రాజకీయంగా కొత్త విద్యుత్ విధానాన్ని వ్యతిరేకించిన తెలంగాణ కూడా స్మార్ట్ మీటర్లను తెప్పిస్తున్నది. రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి క్షేత్ర స్థాయిలో ఉచితాలపై వేటుకు కారణమవుతున్నది. వాస్తవాలిలా వుంటే అంతా రాష్ట్రమే చేస్తున్నదనీ, కేంద్రం పాత్రను టిడిపి, దాన్ని బలపర్చే మీడియా కప్పిపుచ్చడం మరో విపరీతం. టిడిపి యే రేషన్, పట్టణ షరతులు నెరవేర్చింది గనక జగన్‌కు మేలు జరిగిందని కూడా ఈ మీడియా కథనాలిచ్చింది. కేవలం విద్యుత్ రేట్లు మాత్రమే గాక గ్రామాలలో చెత్త పన్నుతో రూ.600 కోట్ల పైన భారాలు మోపే చర్యలూ పట్టణాల్లో పలు యూజర్ చార్జీలు అన్ని రకాల విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు పెట్టి మొబైల్ ఫోన్ల ప్రీ పెయిడ్ తరహాలో అధిక రేట్ల వసూలు అన్నీ ముంచుకొస్తున్నాయంటే కేంద్ర రాష్ట్రాల విధానాల ఉమ్మడి దెబ్బే.
రథం మంటల్లో మత రాజకీయం
ఈ నేపథ్యంలో భారాలకు వ్యతిరేకంగా పోరాడటం తక్షణ కర్తవ్యం కాగా ఆందోళనకరమైన మత రాజకీయాల వైపు రాష్ట్రాన్ని తిప్పడానికి కూడా బిజెపి వ్యూహాలు పన్నడం కనిపిస్తూనే వుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం కావడం దురదృష్టకరం, దానిపై దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చడానికి దోషులను తేల్చి శిక్షించడానికి చర్యలు తీసకోవలసిందే. కాని బిజెపి రథం మంటల్లోంచి మత రాజకీయం రగల్చడం, భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి నేతలు బిజెపిని మించి మత భాషలో మాట్లాడటం బిజెపి శ్రమ తగ్గించాయని చెప్పాలి (వైసీపీ నేతలు విజయ సాయి రెడ్డి వంటి వారు ఏ మాత్రం తీసిపోకుండా మీదే బాధ్యత అంటూ చంద్రబాబుపై ట్వీట్లు సంధించారు). రథం ఘటనలో నిజాలు తేల్చడం కంటే రాష్ట్రంలో క్రైస్తవ హిందూ విభేదాలు పెంచడమే లక్ష్యంగా సమస్య దారి మళ్లించబడింది. ముఖ్యమంత్రి కుటుంబ విశ్వాసాలు, కొన్ని ప్రచారాలు ఇందుకు అవకాశంగా తీసుకోవడం నిరంతరం జరుగుతున్నది. ఎవరి విశ్వాసాలు ఏమైనా దేశంలో రాష్ట్రంలో అన్ని మతాల సామరస్య భావన, లౌకిక విలువలు వుండాలి కాని పరస్పర వైషమ్యాలు పెంచడం తెలుగు ప్రజలు ఆమోదించరు. తిరుపతి సింహాచలం సహా అన్నిటినీ అసందర్భంగా అంతర్వేదితో కలపి మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? గతంలో బిజెపి కూడా నాలుగేళ్లు అధికారం పంచుకున్నప్పుడే పుష్కరాల ప్రమాదాలు, కె పెంటపాడు రథం కాలిపోవడం వంటివి జరిగాయి. వాటికి బాధ్యత టిడిపి అని రాజకీయంగా చెప్తూ...ఇప్పుడు జరిగేవి మాత్రం క్రైస్తవ, హిందూ ఘర్షణగా చెప్పడం ఎలా పొసుగుతుంది? ఎ.పి లో 90 శాతం పైన హిందువులు, 7 శాతం పైన ముస్లిములు వుండగా క్రైస్తవులు రెండు శాతం కూడా లేరు. దళితులపై దాడులను గురించి విమర్శిస్తూ మళ్లీ ఆ దళితులను క్రైస్తవులుగా చూపడం వింత రాజకీయం. ఏ మత స్థలంపై దాడి జరిగినా తప్పే. వాటిపై లోతుగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాల్సిందే. ప్రజలు తమ దేవతలను పూజించుకుంటారే గాని ఇతరులతో తగాదాలు కోరుకోరు. ఈ మతతత్వ వివాదంలో బిజెపి ది ప్రధాన పాత్ర గనక కేంద్ర సిబిఐ కే దర్యాప్తు అప్పగించడం మంచిదే. భిన్న మతాలతో విశ్వాసాలతో కూడిన దేశం ఇది. ఇప్పటికే మత రాజకీయాలతో చాలా మూల్యం చెల్లించాము. ఎ.పి, తెలంగాణ లలో లౌకికతత్వం, మత సామరస్యం తప్ప మతోన్మాద రాజకీయాలు పెరగలేదు. అందుకే ఈమధ్య బిజెపి నేతలు తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందని మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బిజెపి వ్యూహాలను విమర్శించేందుకు వైసీపీ గాని టిడిపి గాని సిద్ధం కావడం లేదు. రథం దగ్ధం కేసు సిబిఐ కి అప్పగించడం ద్వారా తమపై భారం లేకుండా చేసుకోవాలని ప్రభుత్వం భావించిందనేది స్పష్టం. అయితే దర్యాప్తు జరిపి నిజాలు తేల్చడం చాలా కాలం పట్టే వ్యవహారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం, వీటిని ఆధారం చేసుకుని విద్వేషం రెచ్చగొట్టాలని చూసే వారిని అడ్డుకోవడం రాజకీయ పార్టీల బాధ్యత. ప్రధాన పార్టీలుగా వున్న వైసీపీ టీడీపీ తమ రాజకీయ వివాదాలలో మునిగి తేలుతూ కొత్త వ్యూహాలతో వస్తున్న బిజెపి కి ఉపయోగపడుతున్న పరిస్థితిలో ఇది పెద్ద సవాలే. వైసీపీ నేతలు బిజెపిని ఎదుర్కోకపోగా ఎక్కువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న జిఎస్‌టి లోటుపై కేంద్రానికి ముఖ్యమంత్రి మద్దతునివ్వడం, మాకు జాతీయ విషయాలు ముఖ్యం కాదని చెప్పడం అందుకు వ్యతిరేక సంకేతాలు ఇస్తున్నాయి. మోడీ, అమిత్ షా లను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు తహతహలాడటం. పవన్ కళ్యాణ్ ఏకంగా అంతర్వేది దీక్షలు చేపట్టడం బిజెపి కి మహదానందం కలిగించే విషయాలు. ప్రజలూ లౌకిక పార్టీలూ తీవ్రంగా తీసుకోవలసిన అంశాలు కూడా ఇవే. ఇప్పటికే కుల చిచ్చు రగులుతున్న ఈ రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలు పెరిగితే పర్యవసానాలు దారుణంగా వుంటాయని ఎవరూ మర్చిపోకూడదు.










