ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
- అధికారులు, రాజకీయ నాయకులతో ఆర్‌డిఒ సమావేశం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మార్చి 13న జరగనున్న తూర్పు రాయలసీమ, పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎంఎల్‌సి ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని, అధికారులు ఎన్నికల నిర్వహణ బాధ్యతగా నిర్వహించాలని ఆత్మకూరు ఆర్‌డిఒ ఎస్.కరుణకుమారి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడిఒలతో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, 16వ తేదీ నుంచి నోటిఫికేషన్ ప్రారంభమవుతుందని 23వ తేదీ లోపు నామినేషన్లు దాఖలు చేసుకోవొచ్చని తెలిపారు. 24వ తేదీ స్క్రూట్‌ని జరుగుతుందని 27వ తేదీ విత్‌డ్రాలు చేసేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే మార్చి 13వ తేదీ ఎంఎల్‌సి ఎన్నికలు నిర్వహించినట్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆయా మండలాల ఎంపిడిఒలు ఆధ్వర్యంలో మండల టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు 24 గంటల విధుల్లో ఉండేలా సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి టెండర్లు పిలవడం చేయకూడదని, ఎలాంటి సమావేశాలకు అధికారులు పాల్గొనకూడదని సూచించారు. నగదు, మద్యం సరఫరా లాంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సెన్సిటివ్, హై పవర్ సెన్సిటివ్లను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాజకీయ నాయకులు పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి మూడు విడతలుగా ప్రత్యక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైనా అనుమానం వచ్చిన ఓటును గుర్తిస్తే గుర్తిస్తే ప్రత్యేక ఫారం పూర్తిచేసి చాలెంజ్ ఓటుగా వేయించాలని ఓటరు జాబితాలో ఉండే వారిని ఓటు వేయకుండా వెనక్కి పంపరాదని సూచించారు. ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండ వెంకటేశ్వర్లు, నోటి వినరుకుమార్ రెడ్డి, టిడిపి నాయకులు తుమ్మల చంద్రరెడ్డి, బిఎస్‌పి నాయకులు నంద ఓబులేసు, కాంగ్రెస్ నాయకులు వి.నాగరాజు పాల్గొన్నారు.










