Jul 18,2021 16:39

జంగారెడ్డిగూడెం : ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్‌ ఐకేర్‌ ఆస్పత్రిలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి నాని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్ర పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను సిఎం ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారని చెప్పిన మంత్రి.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఏ సమస్య అయినా నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు.