Aug 20,2022 07:42

* రికార్డుల్లో సాగు!
* ఖరీఫ్‌లో వింత ధోరణి
* ఆగస్టు మూడవ వారానికీ అంతంతే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో వింత ధోరణి ఆవిష్కృతమైంది. ఆగస్టు మూడవ వారం గడుస్తున్నా ఒక వైపు చాలా చోట్ల సేద్యం లేక భూములు ఖాళీగా కనిపిస్తుండగా మరో వైపు అధికారిక రికార్డుల్లో పంట సాగులు నమోదవుతున్నాయి. గణాంకాలు తాత్కాలికమని పేర్కొని కాగితాలపై సేద్యపు విస్తీర్ణాన్ని పెంచి చూపిస్తున్నారని ఆరోపణలస్తున్నాయి. అందుకు ప్రభుత్వం నుంచి పలు విధాలా వస్తున్న ఒత్తిళ్లే కారణమని సమాచారం. డీజిల్‌, పెట్రోలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాల ధరల పెరుగుదల, పండించిన పంటలకు గిట్టుబాటుధర లేమి, విపత్తు నష్టాలు ఇత్యాది సమస్యలతో రైతులు పంటల సేద్యంపై నిరాశ ఏర్పరుచుకున్నారు. దాంతో సీజన్‌ ప్రారంభం నుంచీ సాగు ఉత్సాహంగా సాగట్లేదు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సైతం చాలా చోట్ల సాగు తగ్గింది. కాగా ఎలాగైనా సాగును పెంచేందుకు సర్కారు నానా ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఆరోపణలస్తున్నాయి. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇచ్చే 'రైతు భరోసా' సాయాన్ని, పంటలు సాగు చేయకపోతే వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందన్న ప్రచారంతో రైతులు ఏదో ఒక పంట వేసినట్లు ఇ-క్రాప్‌, ఇతర రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. రాయలసీమలో వేరుశనగ గిట్టుబాటు కాక రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు నాణ్యత లేమి, బహిరంగ మార్కెట్‌ కంటే ఎక్కువ ధర ఉండటంతో సబ్సిడీ విత్తనాలను చాలా చోట్ల నిరాకరించారు. అయితే 'భరోసా' వెనక్కి ఇచ్చేయాలనడంతో, భరోసా సొమ్ముతో రాయితీ విత్తనాలు తీసుకున్నా పంట వేయలేదు. అటువంటి రైతుల పేర్లను పంట సాగు చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. పంటల బీమా, పంట రుణాల రెన్యువల్‌, వడ్డీ రాయితీ పథకాలు వర్తిస్తాయంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని చోట్ల వాస్తవానికి పంటల సేద్యం 40-50 శాతమే జరగ్గా, 60-70 శాతం చూపించారని తెలుస్తోంది.
8 జిల్లాల్లో సగమే
వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఆగస్టు 17 నాటికి విశాఖ జిల్లాలో 25 శాతం లోపు పంటలు సాగయ్యాయి. అల్లూరి, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలలో 50 శాతం లోపు పంటలు వేశారు. ఈ సమయానికల్లా వేరుశనగ సాగు పూర్తి కావాలి. కానీ ఆ పంట 77 శాతమే సాగైంది. ఇప్పటికి పప్పుధాన్యాల సాగు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా 42 శాతమే సాగయ్యాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే కందులు 57 శాతమే సాగయ్యాయి. మొత్తంగా ఆహార పంటలు 80 శాతం వేశారు. వరి 63 శాతం సాగైంది. నూనెగింజలు 80 శాతం సాగయ్యాయి. పత్తి 92 శాతం సాగైంది.
తెగుళ్ల విజృంభణ
సాగు అంతంతమాత్రంగా ఉండగా వేసిన పంటలపై తెగుళ్లు విజృంభించి నష్టం చేస్తున్నాయి. దాదాపు లక్ష ఎకరాల్లో పత్తికి వివిధ రకాల తెగుళ్లు వ్యాపించాయి. వేరుశనగ 50 వేల ఎకరాల్లో తెగుళ్లు సోకాయి. వరి, మిరప, మొక్కజన్న, ఆముదాలకు వివిధ తెగుళ్లు వ్యాపించాయి. సకాలంలో గుర్తించి సస్యరక్షణా చర్యలు చేపట్టడం వలన అదుపు చేయగలిగామని, నష్టం లేదని వ్యవసాయశాఖ చెబుతోంది.

lands