Jul 06,2021 06:06

ప్రభుత్వ కాలేజీల మాదిరే ఎం.ఆర్‌ కాలేజీ ఉచిత విద్య ఇస్తున్నందున ప్రజలకు ప్రభుత్వ కాలేజీ అవసరం రాలేదు. ఎయిడ్‌ నిలిపివేయడం వలన ఎం.ఆర్‌ విద్యా సంస్థలు ఉచితంగా విద్యను అందించ లేవు. సిబ్బందిని రెగ్యులర్‌ చేయవు. ప్రభుత్వ సంస్థల్లో వలే జీతభత్యాలు ఇవ్వవు. చైర్మన్‌ ఎవరైనా జరిగేది ఇదే. రోజు రోజుకు మరింత క్షీణిస్తుంది. అందువల్లనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి.
     వైసిపి ప్రభుత్వం అశోక్‌ గజపతి రాజుని మాన్సాస్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగించి ఢిల్లీలో బిజెపి మీడియా ప్రతినిధి సంచయిత గజపతిరాజును నియమించింది. అశోక్‌ గజపతి రాజు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని రద్దు చేసింది. అశోక్‌ గజపతిరాజునే మాన్సాస్‌ చైర్మన్‌గా తిరిగి నియమించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

                                                                   నిజానిజాలు తేల్చాలి

    సంచయిత కొన్ని భూ రికార్డులు మాయం చేశారని అశోక్‌ గజపతిరాజు ఆరోపణ. గత పదేళ్లుగా మాన్సాస్‌ ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్‌ జరగలేదని దేవాదాయ శాఖ మంత్రి ఆరోపణ. దానిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ విచారణ ఏదో సంచయితను నియమించే సమయంలో చేసి వుండొచ్చు. కోర్టు తీర్పు తర్వాత చెప్పడంతో దేవాదాయ మంత్రి ఆరోపణ రాజకీయ రంగు పులుముకుంది. ఏది ఏమైనా ట్రస్ట్‌పై వచ్చిన అన్ని ఆరోపణల మీద వెంటనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలి.
 

                                                గజపతి రాజుల కుటుంబ వ్యవహారం కాదు

    ఇప్పటికైనా మాన్సాస్‌ ట్రస్టును గజపతిరాజుల స్వంత కుటుంబ వ్యవహారంగా, రాజకీయ పార్టీలు మధ్య తగువుగా కాకుండా ప్రజల సమస్యగా చూడాలి. మాన్సాస్‌ విజయనగరంలో ప్రధానమైన విద్యా వ్యవస్థను కలిగి ఉంది. వందల మంది ఉద్యోగులు, వేల మంది విద్యార్థులు అందులో భాగం. దేవాదాయ భూముల్లో వేలాది రైతులు, దేవాలయాల్లో పని చేసే సిబ్బంది జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి. అందువలన సమస్యను ప్రజల కోణం నుండి చూడాలి.
 

                                                          ఆఫీస్‌ను ఎందుకు మార్చారు ?

    సంచయితను మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా నియమించడంతో జగన్‌ బిజెపితో కలిసి వ్యవహరిస్తున్నారనే అనుమానానికి తావిచ్చారు. ట్రస్టు ఆఫీసును కోట నుండి పద్మనాభం మార్చడం అనేక అనుమానాలకు దారి తీసింది. మాన్సాస్‌ ట్రస్టుకు వేల ఎకరాల భూములు వున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఈ భూముల కోసమే అన్న బలమైన అనుమానాలు ప్రజలకు కలిగించింది. లేకుంటే ఆఫీసు మార్చాలిన అవసరం ఏమున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 

                                              కాలేజీ భూమితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా ?

  సంచయితను చైర్‌ పర్సన్‌ చేసిన తరువాత ఎం.ఆర్‌ కాలేజీని ఎయిడెడ్‌ నుండి అన్‌ ఎయిడెడ్‌ గా మార్చడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు రద్దు చేయడం, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు బలవంతంగా టి.సి లు ఇచ్చి పంపివేయడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, రెగ్యులర్‌ బోధనా సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం, ఎం.ఆర్‌ హాస్టల్‌ ప్రాంగణానికి కాలేజీని షిఫ్ట్‌ చేయడానికి ఏర్పాట్లు చేయడం చూస్తే నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన కాలేజీ భూమి కోసమే ఇదంతా జరుగుతుందా అనే అనుమానం అందరికీ కలిగింది.
 

                                                    ప్రజలే కాలేజీని కాపాడుకున్నారు

   ఎం.ఆర్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, మాన్సాస్‌ ఉద్యోగులు, విజయనగర పుర ప్రజలు, రాజకీయ పార్టీల సహకారంతో విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఎం.ఆర్‌ కాలేజీ విద్యార్థులు మొక్కవోని పట్టుదలతో పోరాడారు. కరోనా బారిన పడ్డా పట్టు సడలించక ధైర్యంతో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఎం.ఆర్‌ కాలేజీ విద్యార్థులను కదిలించి పట్టుదలగా పోరాడారు. కాలేజీలో అడ్మిషన్లు యథాతథంగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
 

                                                    అశోక్‌ గజపతిరాజు వైఖరి మారుతుందా ?

    హైకోర్టు తీర్పుతో తిరిగి నియమించబడిన అశోక్‌ గజపతిరాజు తన వైఖరి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి. ఎం.ఆర్‌ కాలేజీని ఎయిడెడ్‌ నుండి అన్‌ ఎయిడెడ్‌ గా మార్చడానికి ప్రతిపాదన చేసింది అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ పదవిలో ఉన్న కాలంలోనే. ఆ తీర్మానాన్నే ప్రభుత్వానికి పంపామని సంచయిత బహిరంగంగా ప్రకటించారు. ఆ ప్రకటనపై అశోక్‌ స్పందించ లేదు. కాలేజీని అన్‌ ఎయిడెడ్‌గా మార్చే సంచయిత ప్రయత్నాన్ని అశోక్‌ వ్యతిరేకించలేదు. మౌనం పాటించారు. మీడియా ఎంత అడిగినా స్పందించలేదు. మహారాజా మహిళా కళాశాలను అన్‌ ఎయిడెడ్‌గా మార్చిందీ అశోక్‌ గజపతి రాజు గారే. ఈయనది ఆధిపత్య పోరే తప్ప ఎం.ఆర్‌ కాలేజీని రక్షించడానికి కాదని రుజువైంది.
 

                                                      ప్రభుత్వాలు వేరైనా విధానాలు అవే

   విద్యను ప్రైవేటుపరం చేసి ప్రభుత్వం విద్యనందించే బాధ్యతల నుండి తప్పుకోవాలి అనే సరళీకరణ విధానాన్ని రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేయనారంభించారు. అందులో భాగంగా ఎయిడ్‌ తగ్గించడం మొదలు పెట్టింది చంద్రబాబే. అశోక్‌ గజపతి రాజు రాష్ట్ర మంత్రిగా ఆ నిర్ణయంలో భాగస్వామి. కేంద్రం యూజీసీ పోస్టులు నింపడం మానేసింది. బోధనా సిబ్బందిని 20 ఏళ్లుగా రెగ్యులర్‌ చేయలేదు. సిబ్బందికి కనీస వేతనాలు లేవు. ఇప్పుడు ఆ సరళీకరణ విధానాలకు తన హిందూత్వ ఎజెండాను తోడు చేసి కేంద్రంలోని బిజెపి నూతన విద్యా విధానం పేర రాష్ట్రాల మీద రుద్దుతోంది. ఈ విధానాన్నే జగన్‌ ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేయడానికి తయారవుతోంది. కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు మారినా విధానాలలో మాత్రం ప్రైవేటీకరణ కొనసాగుతోంది.
     రాష్ట్రం లోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలన్నింటినీ 'ఎయిడ్‌ లేకుండా మీరే నడుపుకుంటారా? లేక ప్రభుత్వానికి అప్పజెప్తారా?' అని ప్రభుత్వం అడిగింది. కోట్ల విలువైన స్థలాలు, భవనాలు వున్న ఎయిడెడ్‌ సంస్థలను ఆ ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పజెప్పడానికి సిద్ధపడడంలేదు. ప్రభుత్వ ఎయిడ్‌ ఆగిపోయింది గనుక ఫీజులు అమాంతం పెంచేస్తున్నారు. అక్కడ చదివే విద్యార్థులంతా పేద, దళిత, బలహీన వర్గాలవారే. ఫీజుల భారం మోయలేక చదువులు మానుకునే స్థితి వస్తుంది. తగిన సంఖ్యలో విద్యార్థులు లేరని చెప్పి క్రమంగా కాలేజీలను మూసేసి ఆ స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఈ విధంగా ఒకవైపు పేదలను చదువుకు దూరం చేస్తూ మరోవైపు ప్రజల ఆస్తితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దోహదం చేస్తోంది.
 

                                                          ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

   ప్రభుత్వ కాలేజీల మాదిరే ఎం.ఆర్‌ కాలేజీ ఉచిత విద్య ఇస్తున్నందున ప్రజలకు ప్రభుత్వ కాలేజీ అవసరం రాలేదు. ఎయిడ్‌ నిలిపివేయడం వలన ఎం.ఆర్‌ విద్యా సంస్థలు ఉచితంగా విద్యను అందించ లేవు. సిబ్బందిని రెగ్యులర్‌ చేయవు. ప్రభుత్వ సంస్థల్లో వలే జీతభత్యాలు ఇవ్వవు. చైర్మన్‌ ఎవరైనా జరిగేది ఇదే. రోజు రోజుకు మరింత క్షీణిస్తుంది. అందువల్లనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రభుత్వ పరం అయ్యేంత వరకు విద్యార్థులు, సిబ్బంది, ప్రజలు పోరాడి సాధించాలి.
 

/ వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
ఎం. కృష్ణమూర్తి

ఎం. కృష్ణమూర్తి