ప్రజాశక్తి-విజయవాడ : భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, రూరల్ మండలాలలో (యాంటీ డ్రగ్స్) మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగించేందుకు ఇంటర్మీడియట్, డిగ్రీ,ఇంజనీరింగ్ కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డివైఎఫ్ఐ ప్రచార పోస్టర్ ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తుంది ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ మంది మాదకద్రవ్యాలకు బానిసలు అయ్యారని తెలిపారు. ఒకసారే వాడుతున్న వారు 5.5 శాతం మంది ఉన్నారని, ఇండియాలో అయితే మద్యం 16 కోట్ల మంది, గంజాయి 3.1 కోట్ల మంది, హెరయిన్ 2.8 కోట్ల మంది, కొకైన్ ఇతర మత్తు పదార్థాలు1.18 కోట్ల మంది వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2004లో 21% మత్తుపదార్థులు వాడుతుంటే, 2022 సంవత్సరానికి వచ్చేసరికి మాదకద్రవ్యాలు వాడటం 29% శాతానికి పెరిగిందని లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ఈ మత్తు పదార్థాల గణాంకాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థి, యువత ఆర్గనైజేషన్లు, ఇతర సేవా సంఘాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అనుమానిత డ్రగ్స్ ఏరియాల్లో, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలలో, జిమ్ సెంటర్స్, లైబ్రరీ, యూత్ అడ్డాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ సెమినార్ల్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో డివైఎఫ్ఐ యువత అందరూ పాల్గొంటారని డివైఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.కృష్ణ, ఎన్.నాగేశ్వరరావు తెలియజేశారు.










