Nov 05,2020 08:08

బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్‌ నౌకా విన్యాసాలు భారత్‌ ప్రయోజనాలకు పూర్తిగా భిన్నమైనవి. మరో మాటలో చెప్పాలంటే దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవాలన్న అమెరికా వ్యూహంలో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల ఆరవ తేదీ వరకు, అరేబియా సముద్రంలో 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెండు విడతలుగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. రెండవ విడత విన్యాసాల్లో అమెరికా అణ్వాయుధ సహిత ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ప్రదర్శిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ బలప్రదర్శన అంతా చైనాను ఇరుకున పెట్టడానికే అన్నది నిస్సందేహం! అయితే, దీనివల్ల మన దేశానికి కలిగే ప్రయోజనం నామమాత్రం కాగా, ప్రశాంత సరిహద్దు సముద్ర జలాల్లో బలప్రదర్శనకు అంగీకరించడం, కలిసి విన్యాసాలు చేయడం కొరివితో తల గోక్కోవడంగా మారనుంది.
పొరుగు దేశాల్లోకి చొరబడటం, ఆ దేశాల భూభాగాలను దురాక్రమించడం వంటి చరిత్ర చైనాకు ఎన్నడూ లేదు. తాజా ఘర్షణల అనంతరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ సైతం మన సరిహద్దుల్లోకి చైనా ప్రవేశించలేదని చెప్పడం గమనార్హం. మన దేశమే కాదు, చైనాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకునే వియత్నాం కూడా చైనాను దురాక్రమణదారునిగా చెప్పడం లేదు. పైగా, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది. చిత్రమేమిటంటే, సరిహద్దు దేశాలేవీ చెప్పని ఆ మాటను ఈ ప్రాంతంతో ఏమాత్రం సంబంధం లేని అమెరికా సామ్రాజ్యవాదం ప్రచారం చేస్తోంది! దానికి కార్పొరేట్‌ మీడియా వంత పాడుతూ ప్రజానీకంలో భావోద్వేగాలను రెచ్చగొడుతోంది.
సోవియట్‌ రష్యా బలంగా ఉన్న కాలంలో అమెరికా దూకుడుకు కళ్లెం వేయగలిగింది. మన దేశం కూడా రష్యా సహకారంతో అభివృద్ధి సాధించింది. రష్యా పతనం అనంతరం ఏర్పడిన ఏకధృవ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదానికి అడ్డులేకుండా పోయింది. అనేక దేశాలపై బలప్రయోగాలకు దిగింది. ఈ సమయంలోనే చైనా బలమైన ఆర్థికశక్తిగా ఎదిగి నిలదొక్కుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడం అమెరికాకు కంటగింపుగా మారింది. భారత్‌ వంటి బలమైన దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంటే ఈ ప్రాంతంలో ఆడింది ఆటగా సాగించవచ్చన్నది అమెరికా కుట్ర! దీనిలో భాగంగానే అనేక ఒప్పందాల పేరుతో వల వేసింది. కార్పొరేట్‌ ప్రయోజనాలకే పెద్దపీట వేసే భారత పాలక వర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే దీనిలో భాగస్వామ్యం అవుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమైన ఈ పరిణామాన్ని బిజెపి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది! తాజా ఘర్షణల నేపథ్యంలో అమెరికా మరింత వేగంగా పావులు కదుపుతోంది. 1962లో జరిగిన యుద్ధం సందర్భంగా కూడా అమెరికా ఇటువంటి ప్రయత్నమే చేసింది. అప్పటి అధ్యక్షుడు కెనడీ తమ శిబిరంలో చేరమని బాహాటంగానే ఇచ్చిన పిలుపును నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించి, అలీన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వచ్చింది. ఆ వ్యూహమే మన అంతర్జాతీయ సంబంధాలకు ప్రాతిపదికగా చాలా కాలం కొనసాగింది. భారతదేశం శాంతికాముక దేశంగా పేరు తెచ్చుకుంది. విచక్షణా రహితంగా సాగే ఆయుధ పోటీని, అణ్వస్త్ర ప్రయోగాలనూ మన దేశం వ్యతిరేకిస్తూ నిలిచింది. ప్రపంచ శాంతికి దోహదం చేసింది. కానీ, ఆ గతానికి విరుద్ధంగా ఇప్పుడు అమెరికా యుద్ధ వ్యూహంలో దేశం భాగస్వామి అవుతుండటం బాధాకరం! అత్యధిక జనాభా ఉన్న భారత్‌, చైనా కలిసి ప్రయాణం చేస్తే అద్భుతాలు సాధిస్తామని చైనా గతంలోనే చెప్పింది. కొంతకాలంగా చైనా సాధిస్తున్న అభివృద్ధి ఫలాలు మన దేశానికీ అందుతూనే ఉన్నాయి. కానీ, ట్రంప్‌ తన స్వప్రయోజనాల కోసం చైనా వ్యతిరేక ప్రచారాన్ని చేపడితే దానిని మోడీ ప్రభుత్వం వంటబట్టించుకుంటోంది. దీనివలన భారత్‌, చైనా దేశాలు రెండింటికి నష్టమే వాటిల్లుతోంది. అమెరికా ధృతరాష్ట్ర కౌగిలి నుండి బయటపడటం ద్వారానే ఆ ఫలాలను పూర్తి స్ధాయిలో అందుకోవడంతో పాటు, ప్రపంచ శాంతికి బాటలు వేయగలం!