ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ అధ్యక్షుడు హెహబాజ్ షరీఫ్ ఖండించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల నిర్వహణలో పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని అన్నారు.
'గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించబడింది. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్‌ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది' అని పాక్ ప్రధాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'పాకిస్థాన్, అమెరికా ఎంతో కాలంగా స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాల కలిగి ఉన్నాయి. ప్రపంచం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాక్ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి, మన్నికైన ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప పాక్-అమెరికా సంబంధంపై అనవసరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. శాంతి, భద్రతను పెంపొందించడానికి యుఎస్‌తో సహకరించాలనేది మా కోరిక' అని షరీఫ్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి అని, ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉందని ఓ సమావేశంలో బైడెన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.










