May 18,2023 08:54
  • పృథ్వీ షా, రోషా అర్ధసెంచరీలు
  • లివింగ్‌స్టోన్‌ పోరాటం వృధా
  • పంజాబ్‌పై 15పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు
  •  ప్లే-ఆఫ్‌ రేసునుంచి పంజాబ్‌ ఔట్‌..

ధర్మశాల: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ప్లే-ఆఫ్‌కు చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తొలిసారి జూలు విదిలించింది. ధర్మశాల వేదికగా బుధవారం జరిగిన పోటీలో ఢిల్లీ జట్టు 15పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 198పరుగులు చేయగల్గింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు వార్నర్‌-పృథ్వీ షా కలిసి 94పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రిలీ రోషా 37 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 82 పరుగులు, ఫిలిప్‌ సాల్ట్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశారు. వార్నర్‌ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రోసోవ్‌ వచ్చీ రావడంతోనే అదరగొట్టాడు. 25 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ సాధించాడు. పృథ్వీషా 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 54 పరుగులు, డేవిడ్‌ వార్నర్‌ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ ఒక్కడే రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్‌ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి స్లిప్‌లో అమన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. పంజాబ్‌ ఖాతా తెరవకముందే ధావన్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత అథర్వ థాడే(55), లివింగ్‌స్టోన్‌(94; 48బంతుల్లో 5ఫోర్లు, 9సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వీరిద్దరు ఔటయ్యాక లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాణించలేకపోయారు. జితేశ్‌ శర్మ(0), షారుక్‌ ఖాన్‌(6), సామ్‌ కర్రన్‌(11) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్‌ శర్మ, నోర్ట్జేకు రెండేసి, ఖలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోషాకు లభించగా.. ఈ ఓటమితో పంజాబ్‌ జట్టు ప్లే-ఆఫ్‌ రేసునుంచి నిష్క్రమించింది.