Aug 12,2022 22:33

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా దుర్గమ్మను వివిధ వర్ణముల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైనులో వేచి వున్నారు. శ్రావణ శుక్రవారం కావటంతో అధిక సంఖ్యలో యాత్రికులు దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలి రావటంతో దేవాలయ ప్రాంగణం కిట కిటలాడింది. భక్త జనం కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మల్లిఖార్జున మహామండపం ఆరవ ఫ్లోర్‌ నందు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ తెలిపారు.
19న దుర్గమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ నాల్గవ శ్రావణ శుక్రవారం కావటంతో మల్లికార్జున మహామండపం ఆరవ అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించ నున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకూ మొదటి బ్యాచ్‌గా రూ. 1500లు టిక్కెట్లపై వరలక్ష్మీ వ్రతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో గానీ, కొండపైన ఆర్జిత సేవా టిక్కెట్ల కౌంటర్‌ నందు పొందవచ్చన్నారు. అలాగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే వారు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పాల్గొనాలని సూచించారు. ఈ ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన దలచిన ముత్తైదువలు మల్లికార్జున మహా మండపం దిగువ భాగంలో గల టోల్‌ ఫ్రీలో 15వ తేదీ నుండి అప్లికేషన్స్‌ తీసుకుని పేరు రిజిస్టర్‌ చేయించుకోవాలని ఇఓ భ్రమరాంబ కోరారు.