ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : కళారూపాలు, పుస్తకాల ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ రచయిత్రి వాడ్రేపు వీరలక్ష్మి అన్నారు. దసరా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో బుధవారం ప్రారంభ సభ జరిగింది. వీరలక్ష్మి మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను తెలుసుకుని వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. చలం, కాళిదాసు, గురజాడ వంటి మహనీయుల రచనలు, కళారూపాల ద్వారా ఎంతో మందిని చైతన్యం చేశారని గుర్తు చేశారు. కళల ద్వారానే విజ్ఞానం పెరుగుతుందన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు వారిలో సృజనాత్మకతను బయటకు తీసేందుకు కృషి చేస్తున్న నిర్వహణ కమిటీని ఆమె అభినందించారు. దసరా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కె.స్వరూపారాణి మాట్లాడుతూ దసరా సందర్భంగా రెండు రోజులపాట తాము నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని వర్గాల వారి వద్ద నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు పి.జ్యోత్న్స, రచయిత్రి వేమూరి సత్యవతి, కె.ఉషారాణి, ఎంబివికె శిక్షణా కేంద్రం మహిళా విభాగం బాధ్యులు పి.విజయ పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. శాస్త్రీయ నృత్యాలు, పంజాబీ డ్యాన్స్‌తోపాటు నవదుర్గలు పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఉత్సవాల్లో పాల్గొన్న వారికి సెర్ప్ సిఇఒ ఎండి ఇంతియాజ్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.










