Feb 14,2023 22:12

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు, బాధితులు

ప్రజాశక్తి - సోమందేపల్లి : మండల పరిధిలోని కేతగాని చెరువు, తదితర గ్రామాల దళిత రైతుల భూములకు రక్షణ కల్పించాలని కెవిపిఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో కెవిపిఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సిద్దేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులతో కలిసి కెవిపిఎస్‌ నాయకులు మాట్లాడుతూ యంగ్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనే స్వచ్ఛంద సంస్థ ( నరేంద్ర బేడీ ) మామిడి , పశువుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తిని అభివృద్ధి చేస్తూ దళితులను ఆర్థికంగా బలపరస్తామని నమ్మబలికి కేతగాని చెరువు గ్రామానికి చెందిన దళితుల భూములను 25 సంవత్సరాల పాటు లీజు ఒప్పందం ద్వారా 1988 సంవత్సరంలో తీసుకుందన్నారు. కొంతమేర అభివృద్ధిపరిచి అనంతరం 2008 సంవత్సరంలో రాత పూర్వకంగా దళితుల భూముల దళితులకు అప్పగించిందన్నారు. ఆ సమయంలో సంస్థలో పని చేసే లక్ష్మమ్మ అను మహిళ రిజిస్టర్‌ డాక్యుమెంటులో ఉండే కొన్ని లొసుగులను ఉపయోగించి తద్వారా సంబంధిత అధికారులను ప్రలోభ పెట్టి కేతగాని చెరువు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తితో కలసి అక్రమంగా కొనుగోలు జరిపి దళితులను మోసం చేసిందన్నారు. ఇప్పటికీ సర్వే నంబర్‌ 323లో 3.17 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల మేరకు దళితుల పేరు మీదనే ఉందన్నారు. భూమిని కొనుగోలు చేసామని అక్రమంగా దళితుల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన కృష్ణమూర్తిని దళితుల ఐక్యంగా ఎదుర్కొని తమ భూమి రక్షణ కోసం గత సంవత్సర కాలం నుండి పోరాడుతున్నారన్నారు. ఈ విషయమై దళితుల భూములు ఆక్రమణకు గురికాకుండా అక్రమానికి పాల్పడి దౌర్జన్యం చేస్తున్న లక్ష్మమ్మ , కృష్ణమూర్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు..ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య , జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగభూషణ , దళితులు అంజనమ్మ , వెంకట లక్ష్మమ్మ , హనుమక్క , సంజీవమ్మ , అంజనప్ప , నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.