Mar 27,2023 21:03

జిల్లా వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అచ్చెన్న

 కడప ప్రతినిధి జిల్లా వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అచ్చెన్న హత్యకు గురైనట్లు తేలిసిందే. ఎస్‌పి కె.కె.ఎన్‌.అన్బురాజన్‌ విలేకరుల సమావేశంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అచ్చెన్న హత్య కేసు ఛేదించిన క్రమాన్ని పరిశీలిస్తే ఈ నెల 12న డాక్టర్‌ అచ్చెన్న అదృశ్యం కావడం, 14వ తేదీన ఆయన కుటుంబీకులు కడపలోని వెటర్నరీ విభాగానికి చెందిన ముగ్గురు సహ ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, 27వ తేదీన పోలీసుల విచారణలో హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడం తెలిసిందే. ఈ నెల 12 నుంచి 27వ తేదీ వరకు పోలీసుల విచారణలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన జిల్లా అధికారి ఫిర్యాదు చేసిన వెంటనే హత్యాయత్నం కేసుగా పరిగణించి విచారణను వేగవంతం చేయాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. అచ్చెన్న కొందరిపై కేసు నమోదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం, ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించినరీతిలో విచారణ సాగించకపోవడం వంటి ఘటనలతో విచారణ సాగిన తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం
అచ్చెన్న వర్సెస్‌ ఇద్దరు ఎడి, ఓ డాక్టర్‌ మధ్య నెలకొన్న వివాదాన్ని నెలల తరబడి సీరియల్‌గా కొనసాగించడంలోని జెడి, ఉన్నతాధికారుల వైఫల్యమే హత్య ఉదంతానికి దారితీసిందనే చర్చ నడుస్తోంది. ధర్నాలు, నిరసనలు, గేట్లకు తాళాలు వేయడం, ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకపోవడం, సరెండర్లు చేయడం, నెలల తరబడి జీతాలు లేక పోవడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తం కావాల్సి ఉంది. మొక్కుబడిగా త్రిసభ్య కమిటీ పేరుతో విచారణ సాగించడం, సత్వరమే చర్యలు తీసుకపోవడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యమే హత్యోదంతానికి దారి తీయడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు వీరందరినీ డిప్యూటేషన్‌పై జిల్లాలోని వివిద ప్రాంతాలకు పంపించి ఉంటే ఇంతటి దారుణం చోటు చేసుకుని ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది.
ఒక్కరిపైనే కేసు నమోదు
అచ్చెన్న హత్య కేసులోని డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌పైనే పలు సెక్షన్ల కింద నేరం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మృతుని కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్న ముగ్గురు సహ ఉద్యోగుల్లో ఇద్దరికి నేరంలో భాగం లేకపోవడమేమిటనే వాదన ప్రజాసంఘాల నుంచి వినిపిస్తోంది. పైనపేర్కొన్న నిందితునితో కలిసి వీరిద్దరూ తీవ్ర స్థాయిలో విభేదించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. పోలీసులు ఆ కోణంలోనూ దృష్టి సారించామని పేర్కొనడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
వీరిద్దరూ నిర్ధోషులేనా!
అచ్చెన్న కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్న ముగ్గురిలో ఒకరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఇద్దరు సహ ఉద్యోగులు నిర్ధోషులేనా, వీరిద్దరూ పెత్తందారీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతోనే ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం కోణంలో విచారణ సాగించలేదా, లేక ఒత్తిళ్ల కారణంగా తప్పించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్నెళ్లుగా మృతునితో తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగించిన సంగతి తెలిసిందే. నిరసనలు, ధర్నా వంటి చర్యలతో వ్యతిరేకత నేపథ్యంలో పరోక్షంగానైనా హత్య గురించి తెలిసే ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఈలెక్కన హత్య గురించి తెలిసినప్పటికీ పోలీసుల దృష్టికి తేకపోవడమూ నేరమే కదా అనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి కోణంలోనూ విచారణ సాగిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా అచ్చెన్న హత్య అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి కారణమనడంలో సందేహం లేదు.