Sep 16,2023 20:34

మాట్లాడుతున్న సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత

మాట్లాడుతున్న సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత

దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం
-సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత
ప్రజాశక్తి-నెల్లూరు:కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారని, అదే సమయంలో దేశ సంపదనంతా పెద్ద పెద్ద కార్పొరేట్లకు కట్టబెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయని సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత అన్నారు. శనివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సిడబ్ల్యూఎఫ్‌ఐ 69వ ఆల్‌ ఇండియా వర్కింగ్‌ కమిటీ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు , సిడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించాల్సిన ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించడం, భ.ని.రంగం కార్మికులను చైతన్య పరచడం వంటి అంశాలపై చర్చలు నిర్వహించామన్నారు. భవన నిర్మాణ రంగంలో లక్షలాధి మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఒక భాగం సెల్ప్‌ ఎంప్లాయిడ్‌గా ఉంటూ చిన్న చిన్న పనులు (ఇళ్ల నిర్మాణం) ఇతర పనులు చేస్తున్నారన్నారు. సంఘటిత క్షేత్రంలో లక్షల మంది కార్మికులు పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు నిధులు, సంక్షేమ బోర్డు సౌకర్యాలు అందుతున్నప్పటికీ , ఇతర సౌకర్యాలు లభించడం లేదన్నారు. రైల్వే ప్రాజెక్టు, విద్యుత్తు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ప్రభుత్వం రంగంలో కూడా ఈ నిర్మణ పనులు జరుగుతున్నాయని, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు వర్తిస్తాయని, అయితే ఆ చట్టాలు అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా ప్రావిడెండ్‌ ఫండ్‌,కనీస వేతనాలు, ఈఎస్‌ఐ అమలు కావడం లేదన్నారు. ఆరంగంలో పనిచేస్తున్న కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యలపై పోరాటాలు చేయాలని ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా రాబోయో రోజుల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరింత విసృత్త స్థాయిలో, దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసేందుకు సమయత్తం అవుతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులపై దాడులు పెరుగుతున్నాయని, కనీస వేతనాలు అమలు కావడం లేదని, ధరలు పెరుగుతున్నప్పటికీ కార్మికుల వేతనాల్లో పెరుగదల కనిపించడం లేదన్నారు. నిరుద్యోగం అధికంగా పెరిగిపోతుందని, దారిద్యం పెరిగిపోతుందన్నారు. వీటి పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కు సంబంధించిన యాక్టు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం నిర్మాణ రంగం నుంచి సెస్స్‌ వసూలు సక్రమంగా నిర్వహించడం లేదని, సెస్స్‌ ద్వారా వచ్చిన నిధులను నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి వినియోగించకుండా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్ళిస్తున్నాయన్నారు. ఏపిలో ఇదే విధంగా జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్‌ కోడ్లుగా చేసిందని, నేటి వరకు ఆ కోడ్లు అమలు జరగలేదని, అవి అమలు జరిగితే కార్మికులపై మరింత భారాలు మోపబడతాయన్నారు. కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను సైతం కోల్పోతుందన్నారు. సిఐటియు , ఇతర 10 కేంద్ర కార్మిక సంఘాలు , బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అన్ని కలిసి జనవరి 30న ఢిల్లీలో సదస్సు నిర్వహించాయన్నారు. ఆ సదస్సు నుంచి కొన్ని కార్యక్రమాలను తీసుకొని వాటితోపాటు ఆగస్టు 24వ తేదిన జాయింట్‌ ప్లాట్‌ఫాం ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, దేశంలో ఉన్న 500 రైతు సంఘాలు అన్ని కలిపి సంయుక్త కిసాన్‌ మోర్చా పేరుతో డిల్లీలో సదస్సు నిర్వహించాయన్నారు. ఈ సదస్సు నుంచి ధరలు తగ్గించాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లతో రాబోవు రోజుల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా రెండు సంవత్సరాల క్రితం ఊటిలోని లక్ష్మిపూర్‌ ప్రాంతంలో అక్టోబరు 3వ తేదిన జరిగిన ఘటనను (మంత్రి కుమారుడు రైతులపై ట్రాక్టర్‌ నడిపిన) గుర్తు చేసుకుంటూ బ్లాక్‌ డే గా బావించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబరు 26,27,28 తేదిలల్లో దేశం మొత్తం మీద వేలాది మంది కార్మికులు, రైతులు కలిసి 24 గంటల పాటు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతులు వారి సమస్యల పరిష్కారం కోసం వేరుగా, కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం వేరుగా పోరాటాలు చేస్తున్నారని, అయితే గడిచిన రెండు , మూడు సంవత్సరాల నుంచి రైతులు,కార్మికులు ఒకరి పోరాటాలకు మరొకరు మద్దతు ఇచ్చుకున్నారన్నారు.దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా దేశ సంపదను సృష్టించే (కార్మిక, రైతు) రెండు వర్గాలు కలిసి వారి సంయుక్త సమస్యల సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాయన్నారు. డిసెంబరు, జనవరి రెండు నెలల్లో ఈ పోరాటాలను మరింత ఉదృతం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రైల్వే, విద్యుత్తు, జాతీయ రహదారులు,పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ వీటన్నింటినీ కూడా కార్పోరేట్లకు అప్పగించేందుకు అడుగులు వేస్తుందన్నారు. కార్మికులకు, రైతులకు సంబంధించిన సమస్య కాకుండా దేశ ప్రయోజనాలకు విరుద్దం కాబట్టి దేశాన్ని రక్షించాలి.. ప్రజలను రక్షించాలన్న నినాదంతో రెండు వేదికలు కలిసి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నాయన్నారు. నవంబరు మాసం తరువాత మరికొన్ని ముఖ్యమైన పోరాటాలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రమణరావు, జిల్లా అధ్యక్షులు ఛాన్‌బాషా,సిఐటియు నాయకులు కెసి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.