Mar 21,2023 20:34

- సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

రాయచోటి టౌన్‌ : జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టం వాటిల్లిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బి.వెంకటరమణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గ గ్రామాల్లో అరటి, బొప్పాయి, మదనపల్లి, తంబల్లపల్లి, రాయచోటి, సంబేపల్లి మండలాల్లో టమోటా, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో మామిడి, పొద్దుతిరుగుడు, వరి వంటి పంటలు దాదాపు 20 వేల హెక్టార్లకు పైగా నష్టం వాటిల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. కనీస పర్యవేక్షణ చేసి పంట నష్ట తీవ్రతను ప్రభుత్వానికి నివేదికలు పంపలేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడలేదన్నారు. వ్యవసాయ ఉద్యాన వన అధికారుల తీరు మారాలని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు నేడు అకాల వర్షానికి నష్టపోయినప్పుడూ రైతులకు చేయూతనిచ్చేలా గ్రామ గ్రామాన తిరిగి నష్టపోయిన రైతులను పెద్ద ఎత్తున సమీకరించి కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నాగబసిరెడ్డి, ఈశ్వరయ్య, రెడ్డెయ్య, నాగేసు పాల్గొన్నారు.