- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు
ప్రజాశక్తి - తాళ్లరేవు(కాకినాడ జిల్లా) : కేంద్ర ప్రభుత్వంలో మోడీ, బిజెపి విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, దళితులంతా ఈ కుట్రను తిప్పి కొట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. దళిత రక్షణ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పటవల, కొత్తూరు, రాఘవేంద్రపురం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ సమస్యలపై పోరాటాలకు దళితులు సిద్ధం కావాలని కోరారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్లే దళితులకు హక్కులు, స్వేచ్ఛ, ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. అటువంటి రాజ్యాంగాన్ని బిజెపి సర్కారు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆందోళన చెందారు. ఈ కుట్రను తెలియజేయాలనే సంకల్పంతో దళిత రక్షణ యాత్రలను ప్రారంభించామని తెలిపారు. బిజెపి కుట్రను తిప్పి కొట్టకపోతే దళితులకు భవిష్యత్తులో మనుగడ ఉండదన్నాచారు. గతంలో చంద్రబాబు హయాంలో, ప్రస్తుతం జగన్ హయాంలోనూ దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగాయన్నారు. వైసిపి సర్కారు దళితుల సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించిందని తెలిపారు. ఎస్‌ఫి కార్పొరేషన్ నిధుల్ని దళితులకు ఇవ్వకుండా అందరికీ పంచే కార్యక్రమాన్ని జగన్ చేపట్టారన్నారు. దళితుల శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. సబ్ ప్లాన్ నిధుల్ని కేటాయించాలని, అసైన్డ్ భూములను తిరిగి దళితులకు అప్పగించాలని, అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణ జిఒను రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో ఈ నెల 29న విజయవాడలో మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. దీన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్ ఉన్నారు.










