Oct 15,2022 20:40

ప్రజాశక్తి - అమలాపురం :డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఎదురులంక బ్రిడ్జి నుంచి సఖినేటిపల్లి రేవు వరకు ఇరిగేషన్‌ కాలువ గట్లపై సుమారు పది లక్షల కొబ్బరి చెట్లు భూస్వాముల చేతిలో ఉన్నాయని, వాటిని దళితులు, వ్యవసాయ కూలీలు, పేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అమలాపురంలోని బుద్ధ విహార్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఇరిగేషన్‌ కాలువ గట్లపై ఉన్న చెట్ల ఫలాలు కొంతమంది భూస్వాములు, పెత్తందారులే అనుభవిస్తున్నారన్నారు. కొనసీమకు అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేసే విషయంలో పార్టీలకతీతంగా ఎలాంటి పోరాటం చేశామో, అదే విధంగా పోరాడితే పది లక్షలకుపైబడి ఉన్న కొబ్బరి చెట్లు వ్యవసాయ కార్మికులు, పేదలు, దళితులకు అందుతాయని తెలిపారు. కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారుల చేతిలో ఉన్న కొబ్బరి చెట్లను పేదలకు పంచడమంటే అంత సులువుకాదని, ప్రజా సంఘాలు, దళితులందరూ ఒకే తాటిపైకొచ్చి పోరాడితేనే ఇది సాధ్యమన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామసభల్లో తీర్మానం చేసి కొబ్బరి చెట్లను పేదలకు అప్పగిస్తే వారి జీవన విధానం మెరుగుపడుతుందని అన్నారు. ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్త ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. అనంతరం కొబ్బరి చెట్లు సాధన పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో వివిధ ప్రజా, దళిత సంఘాల నాయకులు పాల్గన్నారు.