- ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ప్రజాశక్తి - నక్కపల్లి (అనకాపల్లి) : వర్షాభావ పరిస్థితుల కారణంగా అనకాపల్లి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ నేపథ్యంలో కరువు ప్రాంతంగా ప్రకటించి వారిని ఆదుకోవాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. నక్కపల్లి మండలంలోని వేంపాడు, చందనాడ గ్రామాల్లో ఎండిన వరి నారుమడులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 2,04,133 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, నేటికి కేవలం 84 వేల ఎకరాల్లో మాత్రమే ఉడుపులు అయ్యాయని తెలిపారు. దీనిని బట్టి జిల్లాలో కరువు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం స్పందించి క్షేత్ర స్థాయికి వ్యవసాయ, రెవెన్యూ అధికారులను పంపించి వర్షాభావం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవాలని కోరారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలన్నారు. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు ఇటువంటి పరిస్థితులు దాపురించి ఉండేవి కాదన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, నాయకులు ఎం.రాజేష్, బి.రాము, ఎం.నానాజీ, ఉప సర్పంచ్ జి.నర్సింగరావు, ఆర్.అప్పారావు పాల్గొన్నారు.










