Aug 08,2023 20:26
  •  ముగిసిన 'భూమి కోసం సమర శంఖారావం' పాదయాత్ర
  • ర్యాలీ, ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి) : అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్న వారికి యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ 9/77 చట్ట సవరణ చేయడం దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్ల జంగారెడ్డిగూడెం స్థానిక సుందరయ్య కార్యాలయం నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూముల ఆర్డినెన్స్‌ సవరణ వల్ల భూస్వాములే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదల కంటే అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో బహిరంగ పరచాలని, అర్హులకే యాజమాన్యపు హక్కులను కల్పించాలని కోరారు. అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనర్హుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి హక్కుదారులకు లేదా వారి వారసులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు సీలింగ్‌ భూములతో పాటు పేదలకు పంచడానికి అవకాశమున్న అన్ని రకాల భూములను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యల పరిష్కారంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదన్నారు. 9/77 చట్ట సవరణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్య కిరణ్‌, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తామా ముత్యాలమ్మ పాల్గొన్నారు.