Apr 01,2022 19:10

న్యూఢిల్లీ : మన దేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనాధికారులు విద్యా వ్యవస్థలో మార్పు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురికావడమే కాకుండా.. ఏయేటికాయేడు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల మానసిక ఒత్తిడిని, ఆత్మహత్యల్ని తగ్గించేలా ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదు. పైగా.. విద్యా వ్యవస్థలో చేసే మార్పులు ఇటు దేశానికి, అటు విద్యార్థులకు ఏమైనా ఉపయోగపడతాయా? అంటే అదీ లేదు. కేవలం కార్పొరేట్‌ విద్యా సంస్థల్ని ప్రోత్సహించడానికి, కోచింగ్‌ సెంటర్స్‌ని మరింత బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నాయి. జెఇఇ, నీట్‌ పరీక్షల్లాగా.. తాజాగా మోడీ ప్రభుత్వం సియుఇటి (కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఎగ్జామ్‌ని విద్యార్థులపై రుద్దబోతోంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ఎగ్జామ్‌ కూడా.. విద్యార్థులకు లాభమా? లేక కోచింగ్‌ సెంటర్స్‌కా అనే ప్రశ్న తలెత్తుతోంది.
దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు పెట్టే ఎగ్జామ్స్‌లో కటాఫ్‌ మార్కులకు స్వస్తి చెబుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టింది. ఒక్క మోడీ ప్రభుత్వంలోనే కాదు.. 2010లో యుపిఎ-2 ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సియుఇటిని సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుసిఇటి)గా అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే కేవలం 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే గతేడాది వరకు ఈ ఎగ్జామ్‌ని ఆమోదించాయి. సియుసిఇటి పునరుద్ధరించిన చర్యల్లో భాగంగానే.. సియుఇటి ఎగ్జామ్‌ని దేశంలోని 45 కేంద్రీ విశ్వవిద్యాలయాల అడ్మిషన్లకు యుజిసి తప్పనిసరి చేసింది.
అయితే ఈ సియుఇటి ఎగ్జామ్‌ని ఇంత అత్యవసరంగా విద్యార్థులపై రుద్దడానికి గల కారణాన్ని యుజిసి విన్నవించుకుంది. సెంట్రల్‌ బోర్డు పరీక్షలు కరోనా పరిస్థితుల దృష్ట్యా కానీ.. మరే ఇతర కారణాల వల్ల కానీ.. అకస్మాత్తుగా, అసంబద్ధంగా మారడంతో.. విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొనే.. యూనివర్సిటీలన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టడం జరిగిందని యుజిపి వెల్లడించింది. ఇక ఈ పరీక్షల్ని నిర్వహించడానికి యుజిసి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ని నియమించింది. దీనిద్వారా విద్యార్థులు మొదటి ప్రయత్నానికే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందొచ్చని, ఈ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.. విద్యార్థుల జాబితా, యూనివర్సిటీలో ప్రవేశం పొందడానికి అవకాశముంటుందని యుజిసి పేర్కొంది. బిజెపి తీసుకొచ్చిన ఈ విద్యా విధానం 1984లో మాధురీ ఆర్‌.షా కమిటీ సిఫార్సు చేసింది. బిజెపి యావత్‌ దేశమంతా ఒకే జాతి నినాదంలా.. 'ఒకటే ప్రమాణం' అనే సూత్రం ఆధారంగా ఈ సియుఇటి ఎగ్జామ్‌ను తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఈ పరీక్షకు ఆమోదం తెలిపాయి. అయితే ఈ సియుఇటి ఎగ్జామ్‌ వల్ల విద్యార్థుల్లో అసమానతలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మరింత అన్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎగ్జామ్‌... కోచింగ్‌ సెంటర్ల వ్యాపారానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వ నిర్ణయముందని, దీనివల్ల ముఖ్యంగా పేద విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

students


విద్యార్థులేమంటున్నారంటే..
ఈ సిఎఇటి ఎగ్జామ్‌పై ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదవుతున్న హర్ష్‌ (17) మాట్లాడుతూ.. సియుసిఇటి మార్క్స్‌.. బోర్డ్‌ ఎగ్జామ్‌ మార్కుల నిష్పత్తి ఏ స్థాయిలో పరిగణిస్తుందో స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ సియుసిఇటి ఎగ్జామ్‌ మార్కులను, బోర్డ్‌ ఎగ్జామ్‌ మార్కులను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులపై మరింత భారం పడుతుంది. మార్కుల పరుగులో.. ఒత్తిడికి గురవుతూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని లోతుగా.. చర్చించాలి. ఇక చదువు విషయానికొస్తే.. నా స్నేహితులకి మానవీయశాస్త్రాలంటే అంటే బాగా ఇష్టం. అయితే అక్కడ చదివేందుకు ఆ సబ్జెక్టులు లేకపోవడంతో.. పిసిఎం (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌)వాటివైపు మొగ్గుచూపారు. దీనివల్ల సియుఇటి ఎగ్జామ్‌లో వచ్చే చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకు నా స్నేహితులకు ఎలాంటి అవగాహన ఉంటుంది? ఆ ప్రశ్నలకు వారెలా సమాధానాలు రాయగలరు? అలాగే సైకాలజీ గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకునే విద్యార్థులకు కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టులు అందుబాటులో లేవు. నేను చదివే స్కూల్‌లో సైకాలజీకి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. దాంతో నాకు సియుఇటి ఎగ్జామ్‌కి కొంత ఉపయోగంగా ఉంటుంది. అదే నాతోటి స్నేహితులకు సైకాలజీ సబ్జెక్టులు లేకపోవడం వల్ల వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి ఈ ఎగ్జామ్స్‌ కోసం వారు కోచింగ్‌ సెంటర్స్‌కి వెళుతున్నారు. డబ్బు చెల్లించలేని వారు కోచింగ్‌ సెంటర్స్‌కి వెళ్లలేక మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఉపయోగపడేవిధంగా ఉండాలి' అని అన్నారు. ఇంటర్‌లో వచ్చే మార్కులే కీలకమని కాలేజీలు చెబుతుంటే.. అసలిప్పుడు ఈ మార్కులకు సంబంధమే లేదని కొత్తగా వచ్చిన విద్యావిధానం చెబుతోంది. దీంతో సరిగ్గా చదవని విద్యార్థులు ఆనందపడుతుంటే.. మార్కులే ప్రమాణంగా చదివిన విద్యార్థులు నిరాశపడుతున్నారు.
సిఎఇటి ఎగ్జామ్‌పై నిపుణులు ఏమంటున్నారంటే...!
ఈ ఎగ్జామ్‌ వల్ల ఉన్నత విద్యనభ్యసించే మహిళల శాతం, వారి భాగస్వామ్యం తగ్గుతుందని మైనారిటీ విద్యా సంస్థల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిఎంఇఐ) మాజీ సభ్యురాలు షబిస్తాన్‌ గఫార్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలపై, వారి స్వయంప్రతిపత్తిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆమె తెలిపారు. అలాగే ఈ ఎగ్జామ్‌ విద్యార్థుల ప్రవేశపరీక్షకు సంబంధించిన ఎగ్జామ్‌లా లేదు.. వారిని విద్యకు దూరం చేసేదిగా ఉందని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఎన్‌. సాయి బాలాజి అన్నారు. ఈ సిఎఇటి ఎగ్జామ్‌ మాత్రమే కాదు.. గతలో వచ్చి నీట్‌ ఎగ్జామ్‌ వల్ల కూడా.. విద్యార్థులకు ప్రతికూలాంశాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా గ్రామీణ, పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారని గతంలో జస్టిస్‌ ఎ.కె రంజన్‌ కమిటి నివేదిక పేర్కొంది. మన దేశీయ విశ్వవిద్యాలయాల్లో కుల, లింగ, ధనిక - పేద వంటి తరగతుల అంతరం తగ్గించడం అత్యంత ప్రాధాన్యం. అయితే ఉన్నత విద్యను పొందేందుకు మన విద్యా వ్యవస్థలో మార్పు అవసరం. మరి ఆ ఆ మార్పు ఈ సియుఇటి తీసుకొస్తుందా?